టీడీపీ నేత, సీనియర్ పొలిటిషన్ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తాజాగా ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ డైరెక్టర్ లతోపాటు ఆయన నివాసంలో కూడా ఈడీ అధికారులు మెరుపు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరులో మొత్తం తొమ్మిది చోట్ల ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ తో పాటు పాత గుంటూరులోని రాయపాటి నివాసంలో ఈడి అధికారులు హఠాత్తుగా సోదాలకు దిగారు.
రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ మొత్తం 13 బ్యాంకుల నుంచి 9 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకుని షెల్ కంపెనీలకు మళ్లించినట్టుగా సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది. ఆ కేసు ఆధారంగానే ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఖాతాలో నుంచి సింగపూర్ కు నగదు బదిలీ అయినట్టుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సోదాలు చేపట్టారు. ఆ కంపెనీకి రాయపాటి సాంబశివరావుతో, మలినేని సాంబశివరావు, మరికొందరు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.
వాస్తవానికి 2019లోనే రాయపాటిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అప్పట్లో రాయపాటి నివాసంతో పాటు కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం రేపింది. ఆ తర్వాత పలు సెక్షన్ల కింద రాయపాటితో పాటు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర శ్రీనివాసరావులను కూడా సీబీఐ అధికారులు నిందితులుగా చేర్చారు. అయితే, రాజకీయ కక్షలో భాగంగానే రాయపాటి పై కేసులు నమోదు చేశారని ఆరోపణలు వస్తున్నాయి.