గుంటూరు జిల్లాకు చెందిన ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడికి రాజధాని అమరావతి రైతుల నుంచి సెగతగిలింది. తానురాజకీయాల్లోకి వస్తున్నానని.. త్వరలోనే దీనిపై నిర్ణయంతీసుకుంటానని ఆదిలో చెప్పిన ఆయన ఈ క్రమంలో పలు గ్రామాల్లోనూ పర్యటించారు. ఈ క్రమంలో వైసీపీ పాలనపై ఆయన ప్రశంసలు కూడా కురిపించారు. అనంతరం.. ఎందుకో.. తాను ఇప్పట్లో రాజకీయాల్లోకిరావడం లేదని కూడా చెప్పారు. ఇక, ఆయన పరిస్థితి రాజకీయంగా ఎలా ఉన్నా.. తాజాగా ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటనకు వచ్చారు.
తుళ్లూరు మండలం వెలగపూడికి వచ్చిన రాయుడు.. స్థానిక వీరభద్ర స్వామి ఆలయంలో కుటుంబంతో సహా పూజలు చేశారు. ఈ సందర్భంగా రాజధాని కోసం వేలాది రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్న రాజధాని రైతులు కూడా అక్కడకు చేరుకున్నారు. అంబటి రాయుడు పూజలు పూర్తయ్యే వరకు వారు అక్కడే వేచి ఉన్నారు. అనంతరం.. ఆయనను తమ శిబిరానికి రావాలని రైతులు ఆహ్వానించారు. దీక్షా శిబిరంలోకి వచ్చి తమ సమస్యలు వినాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా పలువురు రైతులు.. తాము రాజధాని కోసం ఇచ్చిన భూములు, ప్రస్తుత ప్రభుత్వం తమపై చేసిన దాడులు వంటివాటిని వివరించే ప్రయత్నం చేశారు.
అయితే.. ఈ సందర్భంగా రాయుడు.. రైతులను వారించారు. ఇప్పుడు తాను దైవ కార్యంలో ఉన్నానని..ఇప్పుడు రాలేనని.. వీలు చూసుకుని వస్తానని సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయారు. అమరావతి గురించి తర్వాత మాట్లాడతానన్నారు. జై అమరావతి అనాలని రైతులు కోరగా… ఇప్పుడు అలాంటి నినాదాలు వద్దని చెప్పారు. అమరావతి రాజధానిగా ఉంటుందని రైతులకు చెప్పిన రాయుడు అక్కడ నుంచి హడావుడిగా కారు ఎక్కి వెళ్లిపోయారు. రాయుడు తమ శిబిరానికి వస్తారని భావించిన రైతులు ఆయన వెళ్లిపోవటంతో నిరాశకు లోనయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates