ఛైర్మన్ కుర్చీకోసం మూడు ముక్కలాట

సుప్రపిద్ధ తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ పదవి కోసం పార్టీలో ముగ్గురు సీనియర్ నేతలు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. వీరిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఇద్దరుంటే మరొకరు బీసీ సామాజికవర్గం. నిజానికి వైసీపీలో ఎవరు ఏ స్ధానానికీ ప్రయత్నాలు చేసుకునేది అంటు ఉండదు. పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఇష్టప్రకారమే జరుగుతుంది. మొహమాటానికి వెళ్ళి, ఒత్తిళ్ళకు గురై జగన్ ఏ పోస్టును ఎవరికీ ఇవ్వరన్న విషయం ఇప్పటికే అనేకసార్లు రుజువైంది.

ఇప్పుడు విషయం ఏమిటంటే ప్రస్తుతం ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి బోర్డు కాలపరిమితి ఆగష్టు నెల 12వ తేదీతో ముగుస్తోంది. అప్పటికి కొత్త ఛైర్మన్ తో బోర్డు సభ్యులను జగన్ ఫైనల్ చేయాలి. లేదంటే రాజకీయ నియామకాలు కాకుండా ఉన్నతాధికారులతోనే స్పెసిఫైడ్ అథారిటితో వ్యవహారాలు నడపాల్సుంటుంది. ఇపుడు బీసీ సామాజికవర్గంలో ఛైర్మన్ పదవికోసం ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి పేరు వినబడుతోంది. అలాగే రెడ్డి సామాజికవర్గం నుండి మాజీ ఎంపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి ఎంఎల్ఏ, మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పేర్లు వినబడుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని జగన్ పక్కా ప్లాన్ చేస్తున్నారు. జగన్ కోరిక నెరవేరాలంటే ముఖ్యంగా బీసీల మద్దతు చాలా అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే జంగా కృష్ణమూర్తి పేరును జగన్ పరిశీలిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. బీసీ సామాజికవర్గాలు అనేసరికి జగన్ దృష్టి ముఖ్యంగా జంగా పేనే ఉంటోంది.

ఇక మిగిలిన ఇద్దరిలో గతంలో ఎప్పుడో మేకపాటికి జగన్ టీటీడీ ఛైర్మన్ పోస్టు హామీ ఇచ్చారనే ప్రచారం ఇపుడు తెరపైకి వచ్చింది. మరి ఆ ప్రచారం ఎంతవరకు నిజమో తెలీదు కానీ ప్రచారమైతే బాగా జరుగుతోంది. ఇదే సమయంలో భూమన పేరు కూడా ప్రచారంలో ఉంది. గతంలోనే ట్రస్టుబోర్డుకు ఛైర్మన్ గా భూమన పనిచేసున్నారు. కాబట్టి మళ్ళీ ఇస్తారా అనేది సందేహంగా ఉంది. ఏదేమైనా రెండుమూడు రోజుల్లోనే ఈ విషయమై స్పష్టత వస్తుందని పార్టీలో టాక్ నడుస్తోంది.