కర్నూలు జిల్లాకు చెందిన మైనారిటీ నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యవహారం.. సంచలనంగా మారింది. ఆయన ఓ మహిళతో మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆడియోలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఓ మహిళతో మాట్లాడుతూ.. ‘‘నా మీద నీకు నమ్మకం లేదా? బిజినెస్‌లో షేర్ ఇస్తాం కదా! ఎంత పెట్టుకోగలవు’’ అని అన్నారు. దీనికి సదరు మహిళ ‘‘3 వరకు పెట్టుకుంటాను. మీ ఇంటికి వచ్చి నేరుగా మీతోనే మాట్లాడుతాను’’ అంటూ వ్యాఖ్యానించింది.
ఇది వాట్సాప్ కాల్ కావడం.. సంభాషణలు బయటకు రావడంతో ఎమ్మెల్యేపై విపక్షాలు విమర్శలుగుప్పిస్తున్నాయి. అంతేకాదు.. ఈ వ్యాఖ్యలతో పాటు మరికొన్ని సంభాషణలు కూడా వినిపించీ వినిపించనట్టుగా ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యేతో మాట్లాడిన మహిళ ఎవరు? ఆ డీల్ ఏంటి? అనేదానిపై రాజకీయ వర్గాల్లోను, విపక్ష నేతల మధ్య చర్చగా మారింది. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఈ ఆడియోపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ నేరుగా స్పందించారు.
నాపై ప్రతిపక్ష పార్టీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఓ మహిళతో మాట్లాడింది వాస్తవమే. అందులో అసభ్యకరంగా ఏముంది? అభ్యంతరకరంగా నేనేమీ మాట్లాడలేదే! అయినా అది రెండేళ్ల క్రితం నాటి ఆడియో. ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశ పూర్వకంగా నన్ను పలచన చేసేందుకు ఇప్పుడు ఆ ఆడియోను తెరపైకి తెచ్చాయి. ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారు అన్నారు.
దీంతో మీడియా మిత్రులు కొందరు అసలు ఆ మహిళ ఎవరు? అని ప్రశ్నించారు. దీనికి హఫీజ్‌ఖాన్ రియాక్ట్ అవుతూ.. ఎమ్మెల్యే వద్దకు ఎన్నో సమస్యలతో ఎంతో మంది వస్తుంటారు. వారితో మాట్లాడటం తప్పు ఎలా అవుతుంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోపై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను కోరాను. ఆ మహిళ ఎవరు, ఇద్దరి మధ్య ఏం ఒప్పందం జరిగిందనే విషయాలు విచారణలో తేలుతాయి. అయినా ఆ మహిళ ఎవరో ఆడియో లీక్ చేసిన వారినే అడగాలి అని వ్యాఖ్యానించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates