రాజ‌మండ్రి సీటుపై వైసీపీ పిల్లి మొగ్గ‌లు…!

ఎలాగైనా స‌రే.. గెలిచి తీరాల‌ని వైసీపీ అధిష్టానం నిర్దేశించుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌మండ్రి సిటీ నియో జక‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున తొలిసారి పోటీ చేసిన కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భ‌వానీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఇక్క‌డ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌నేది వైసీపీ ల‌క్ష్యం. దీంతో రాజ‌మండ్రిలో అనేక ప్ర‌యోగాలు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికి ఇక్క‌డ న‌లుగురు ఇంచార్జ్‌ల‌ను మార్చ‌డం పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కొన్ని రోజుల కింద‌ట రాజ‌మండ్రి సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ను నియ‌మించారు. అయితే.. గ‌త నాలుగేళ్ళలో సిటీ నియోజకవర్గానికి శ్రీనివాస్‌ ఐదో ఇంచార్జ్ కావ‌డం గ‌మ‌నార్హం. మొదట్లో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కోఆర్డినేటర్‌గా ఉండేవారు. అయితే.. ఆయ‌న‌కు ఎంపీకి స‌రిపోలేదు. దీంతో ఆయన్ను తప్పించి సీఎం జగన్‌ స్వయంగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శ్రిఘాకోళ్ళపు శివరామసుబ్రహ్మణ్యంను నియమించారు.

అయినా.. ఇక్క‌డ వైసీపీ పుంజుకోలేదు. పైగా.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కూడా ఆగ‌లేదు. దీంతో కొన్ని నెల‌ల‌కే ఆయ‌న‌ను త‌ప్పించి.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఆకుల సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించారు. అయితే.. ఈయ‌న కూడా ఇక్క‌డి వైసీపీ నాయ‌కుల‌కు స‌రిపోలేదు. దీంతో ఏకంగా రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భరత్‌కు సిటీ బాధ్యతలు అప్పగించారు. దీంతో మ‌రింతగా ఇక్క‌డ రాజ‌కీయం వేడెక్కింది. ఎంపీగా ఉన్న త‌న‌కు ఏమాత్రం విలువ ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న భావించారు.

ఈ క్ర‌మంలోనే డాక్టర్‌ శ్రీనివాస్‌ను స్వ‌యంగా ఎంపీనే సీఎం దగ్గరకు తీసుకువెళ్లి పరిచయం చేసి పార్టీలో చేర్పించారు. సిటీలో ఒక పక్క మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు. మరోక పక్క శివరామసుబ్రహ్మణ్యం వంటి నేతలను పక్కన పెట్టి డాక్టర్‌ శ్రీనివాస్‌కు పగ్గాలు కట్టబెట్టడం చర్చనీయాంశమైంది. అయితే.. ఇదంతా కూడాపార్టీ బ‌లోపేతానికే చేస్తున్న‌ట్టు చెబుతున్నా.. అంత‌ర్గ‌తంగా పార్టీలో నెల‌కొన్న విభేదాల‌ను ప‌రిష్క‌రించ‌డం వైసీపీ పిల్లిమొగ్గ‌లు వేస్తోంద‌న్న‌ది ప‌రిశీల‌కుల మాట‌.