ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ఆముదాలవలస నియోజకవర్గంలో రాజకీయం సల సలమంటోందనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ చిత్రమైన రాజకీయం కనిస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన వారు పోటాపోటీగా రాజకీయాలలో తలపడతారు. మళ్లీ వారానికి ఒకసారైనా ఇళ్లలో కలుసుకుంటారు. ఇదీ.. ఇక్కడి రాజకీయం. వారే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్, ప్రస్తుత వైసీపీ నాయకుడు, స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇద్దరూ కూడా వరసుకు మేనల్లుడు, మేనమామలు.
కానీ, రాజకీయంగా మాత్రం బద్ధ శత్రువులే. అంటే.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే టైపు. అయితే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి.. ఇప్పుడు రాజకీయం మరింత వేడెక్కిందని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. గత ఎన్నికల్లో తమ్మినేని విజయం దక్కించుకున్నారు. ఆయన మేనల్లుడు రవి ఓడిపోయారు. సాధారణంగా ఇతర నియోజకవర్గాల్లో ఉన్నట్టుగా రాజకీయాలు ఇక్కడ లేవనే టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం.. ఓట్ల రాజకీయం తెరమీదికి రావడమేనని చెబుతున్నారు.
ఆముదాల వలస నియోజకవర్గంలో ఇప్పుడు ఎక్కడ విన్నా.. నకిలీ ఓట్ల గురించిన చర్చ జోరుగా సాగుతోంది. డోర్లు లేవు.. కానీ, ఆ డోర్ల నెంబర్లతో మాత్రం వందల కొద్దీ ఓట్లు ఉన్నాయని స్థానికంగా చర్చ సాగుతోంది. దీనిపై రాజకీయ దుమారం తారస్తాయికి చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇవన్నీ.. 2019 ఎన్నికలకు ముందు మీరు చేసిందేనని అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ, వైసీపీనే ఇప్పడు నకిలీ ఓట్లు సృష్టించిందని కూన విమర్శలు గుప్పిస్తున్నారు.
దీంతో ఆముదాల వలసలో నకిలీ ఓట్ల వ్యవహారం తారస్థాయికి చేరింది. దీనిపై అటు వైసీపీ, ఇటు టీడీపీ కూడా పరస్పరం ఎన్నిక లసంఘానికి ఫిర్యాదులు చేసుకున్నాయి. దీనిపై ఇప్పుడు అధికారులు కుస్తీ పడుతున్నారు. ఇదిలావుంటే.. ప్రజలకు చేరువ అయ్యేందుకు వైసీపీ, టీడీపీలు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నాయి. స్పీకర్ తమ్మినేని తన ప్రొటొకాల్‌ను కూడా పక్కన పెట్టి ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఇక, ఈయన వెళ్లిపోయిన గంటల వ్యవధిలో అదే ప్రాంతంలో కూన రవి కుమార్ తెలుగు దేశం పార్టీ జెండాలతో హల్చల్ చేస్తున్నారు. మొత్తంగా ఆముదాల వలసలో మామా-అల్లుళ్ళ ఫైట్ జోరుగా సాగుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates