జనసేన పార్టీ విషయం ఏపీలో తరచుగా చర్చకు వస్తోంది. ఈ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తరచుగా వచ్చే ఎన్నికల్లో విజయం తమదేనని.. చెబుతున్నారు. అంతేకాదు.. ఎవరు ఆపుతారో చూద్దామని కూడా అంటు న్నారు. ఓకే.. ఎవరు ఆపుతారు..? ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కాబట్టి.. ఎన్నికల్లో వారే ఎవరినైనా ముందుకు నడిపించాలి.. లేదా వెనక్కి తిప్పి కొట్టాలి. సో.. ఈ విషయాన్ని తీసుకుంటే.. ప్రస్తుతం జనసేన ఊపు ఏమేరకు పెరిగిందనే చూస్తే.. ఎక్కడి గొంగళి అక్కడే ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఇది కొందరు జనసేన నాయకులకు నచ్చకపోవచ్చు. కానీ, ప్రజానాడి అలానే ఉంది మరి!. గత ఎన్నికల్లో జనసేనకు ప్రజలు పట్టం కట్టాలని.. కడతారని.. పార్టీ నాయకులు ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఏం జరిగింది? దీనిని ఎవరు ఖండించినా.. వాస్తవాలను అయితే..మరుగు పరచలేరు కదా! ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. క్షేత్రస్థాయిలో జనసేన పరిస్థితి దారుణంగానే ఉంది. పవన్ తెస్తున్న ఊపు.. గాలి బుడగలాగానే ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనిస్తున్నవారు చెబుతున్నారు.
ఎక్కడెక్కడ ఎలా ఉందనే విషయం కూడా చర్చకు వస్తోంది. ఉత్తర జిల్లాల విషయానికి వస్తే.. శ్రీకాకుళంలో గరిష్టంగా జనసేన తెచ్చుకున్న ఓట్లు 6500(పవన్ పోటీ చేసిన గాజువాక మినహా). ఇక, ఇతర నియోజకవర్గాల్లో 2000 ల లోపే ఓట్లు పోలయ్యాయి. ఇక, ఉభయ గోదావరులు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో గరిష్ఠంగా తెచ్చుకున్న ఓట్లు 22 వేలు.(ఇక్కడ కూడా పవన్ పోటీ చేసిన నియోజకవర్గం కాకుండా ) ఇక సీమలో అయితే.. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థులకు గరిష్ఠంగా వచ్చిన ఓట్లు 12 వేలు.
మరి ఇలాంటి పరిస్థితి నుంచి మెజారిటీ ఓటు బ్యాంకును సొంత చేసుకునేందుకు జనసేన చాలానే కష్టపడాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఒంటరిగా పోటీ చేస్తారా? కలిసి కాలుదువ్వుతారా? అనేది పక్కన పెడితే.. వ్యక్తిగతం చూసుకుంటే.. జనసేన ఓటు బ్యాంకు అయితే.. పెరగాల్సిన అవసరం చాలా చాలా చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. కేవలం 7 శాతం ఓటు బ్యాంకు ఉందనో.. మరింత పెరిగిందనో సంతోష పడితే.. ప్రయోజనం లేదని.. క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల వారీగా గత ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు మధ్య వ్యత్యాసాన్ని అంచనా వేయాలనే పార్టీ నాయకుల సూచన కూడా!!
Gulte Telugu Telugu Political and Movie News Updates