టార్గెట్ వైసీపీ.. టీడీపీ వివేకా వెబ్‌సైట్ లాంచ్‌

ఏపీలో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా అనేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిన ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ.. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన విష‌యం తెలిసిందే. వివిధ అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసు కువెళ్తోంది. ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఎండ‌గ‌డుతోంది. అదేస‌మ‌యంలో ఇప్పుడు మ‌రో కార్య‌క్ర మానికి కూడా శ్రీకారం చుట్టింది. తాజాగా కొత్త‌గా ఓ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.

దీనిలో సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించిన అన్ని వివ‌రాల‌ను పేర్కొంది. ఈ వెబ్‌సైట్‌ను కేవ‌లం ఈ కార్య‌క్ర‌మానికి మాత్ర‌మే కేటాయించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణంతోపాటు.. ఆయ‌నకు సంబంధించి అప్ప‌ట్లో అంటే 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ నాయ‌కులు ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చెబుతున్నారు.. వంటి వీడియోల‌ను కూడా పొందు ప‌రిచింది.

ఇక‌, ఫొటోలు, వీడియోల‌తో పాటు.. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై వివిధ మీడియా సంస్థ‌లు వెలువ‌రించిన విశ్లేషణాత్మ‌క క‌థ‌నాలు, ప‌రిశోద‌నాత్మ‌క క‌థనాల‌ను కూడా టీడీపీ ఈ వెబ్‌సైట్‌లో పేర్కొంది. అలాగే.. వివిధ సంద‌ర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు, సుప్రీం కోర్టు నుంచి పులివెందుల కోర్టు వ‌ర‌కు.. ఇచ్చిన ఆదేశాలు, సీబీఐ అధికారుల విచార‌ణ‌, నిందితుల వాంగ్మూలాలు ఇలా.. డేట్ టు డేట్ అన్ని విష‌యాల‌ను దీనిలో పేర్కొంది.

మొత్తంగా వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య అనంతర ప‌రిణామాల‌కే ఈ వెబ్‌సైట్‌ను ప్ర‌త్యేకంగా మ‌లిచిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. త‌ద్వారా.. ఈ విష‌యాన్ని లైమ్‌లైట్‌లో ఉంది.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు దీనిని అస్త్రంగా వినియోగించుకోవాల‌నే వ్యూహానికి టీడీపీ తెర‌దీసినట్టుగా విశ్లేష‌కులు భావిస్తున్నారు.