నిజమే… బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెజవాడ ఎంపీ కేశినేని నాని ముహూర్తమే ఖరారు కాని కార్యక్రమానికి రావాలంటూ ఏకంగా ఆహ్వాన పత్రిక అందించేశారు. అంతేనా ఏపీ ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం వైఎస్ జగన్ మహన్ రెడ్డి చేయాల్సిన పనిని కేశినేని నానినే పూర్తి చేసేశారు. ఇంతటి ఆసక్తికరమైన అంశం ఏమిటన్న విషయం పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం పదండి.
బెజవాడ వాసులు ఎన్నాళ్లుగానో కలలు గంటున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ చాన్నాళ్ల తరబడి నిర్మాణం జరుపుకుంటూనే ఉంది కదా. అదిప్పుడు పూర్తి అయిపోయింది. ప్రారంభోత్సవమే తరువాయిగా మారింది. 2014లో బెజవాడ ఎంపీగా గెలిచిన కేశినేని… పట్టుబట్టి మరీ కనకదుర్గ ఫ్లై ఓవర్ కు మంజూరుతో పాటు నిధుల విడుదలనూ సాధించారు. కేశినేని ఎంతగా శ్రమించినా.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ఫ్లై ఓవర్ ఆరేళ్లకు గానీ పూర్తి కాలేదు.
సరే…. అంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వం కదా. కనకదుర్గ ఫ్లై ఓవర్ అయినా… ఇంకే ప్రాజెక్టు అయినా ప్రారంభం కావాలంటే… దానిని వైసీపీ ప్రభుత్వమే ముహూర్తం పెట్టాలి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. ఇక కేశినేని నాని ఏమో విపక్ష టీడీపీకి చెందిన ఎంపీగా కొనసాగుతున్నారాయే. స్థానిక ఎంపీగా కనకదుర్గ ఫ్లై ఓవర్ ఎప్పుడు ప్రారంభం అయినా… కేశినేనిని ఏపీ ప్రభుత్వం తప్పక పిలవాల్సిందే. ఇక ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి ఎవరినైనా పిలవాలా? వద్దా? అన్న విషయాన్ని కూడా నిర్ణయించుకోవాల్సింది జగన్ సర్కారే.
ఇలాంటి నేపథ్యంలో శనివారం ఢిల్లీలో ప్రత్యక్షమైన కేశినేని నాని.. నేరుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తి అయిన విషయాన్ని ఆయనకు చెప్పారు. ప్రాజెక్టుకు అనుమతులతో పాటు నిధుల విడుదలలోనూ చొరవ చూపినందుకు గడ్కరీకి కేశినేని ప్రత్యేకంగా కృతజ్ఝతలు చెప్పారు. అంతటితో ఆగని కేశినేని నాని.. కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం మీ చేతుల మీదుగానే జరగాలంటూ గడ్కరీని కోరారు. ఈ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి రావాలంటూ గడ్కరీని నాని ఆహ్వానించారు.