జగన్ హయాంలో సర్పంచ్ ల దుస్థితి వర్ణనాతీతం అని టీడీపీ నేతలు చాలా కాలంగా విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. సర్పంచ్ లను జగన్ తోలుబొమ్మలుగా మార్చారని, రాజ్యాంగం వారికి ప్రసాదించిన కొన్ని హక్కులను కాలరాస్తున్నారని విపక్ష నేతలు కూడా మండిపడుతున్నారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులను జగన్ పక్కదారి పట్టించారని, తక్షణమే పక్కదారి పట్టించిన 8,660 కోట్ల రూపాయలను గ్రామపంచాయతీల ఖాతాలలో జమ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తమ హక్కుల కోసం ఏపీలోని సర్పంచ్ లు గతంలో పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే, తనకు చెడ్డ పేరు వస్తుండడంతో ఈ నిరసన కార్యక్రమాలపై జగన్ ఉక్కుపాదం మోపుతూ వచ్చారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచ్ లు ఆందోళనబాటపట్టారు. వైసీపీ బలపరిచిన సర్పంచ్‌లు కూడా తమకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ జగన్ కు మొరపెట్టుకుంటున్నారు. పంచాయతీలకు కేంద్రం మంజూరు చేసిన ఆర్థిక సంఘం నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. జగన్ తీరుకు నిరసనగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర సర్పంచ్‌లు నిరసనకు దిగారు. సైబర్‌క్రైమ్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఫిర్యాదు చేశారు.
ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.కర్నూలు కలెక్టరేట్ ఎదుట గోవింద నామాలతో సర్పంచ్ లు నిరసనకు దిగారు. గోవిందా.. గోవిందా అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అర్ధనగ్నం ప్రదర్శన చేసి, రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పంచాయతీలను జగన్ నిర్వీర్యం చేశారని, సచివాలయాలను పంచాయతీలలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు సత్వరం పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates