ఏపీకి ప్రత్యేక హోదా అందని ద్రాక్షగా మిగిలిన సంగతి తెలిసిందే. ఇక, ఇరు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీలు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి పదేళ్లు గడిచినా విభజనానంతరం తీవ్రంగా నష్టపోయిన ఏపీ కోలుకోలేకపోయింది. ఈ నేపద్యంలోనే హోదాతో పాటు విభజన హామీల అమలు ప్రస్తావన పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిసారీ టీడీపీ ఎంపీలు లేవనెత్తుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం నాడు లోక్ సభలో ఈ విషయంపై కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కీలక ప్రకటన చేశారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుతో పాటు మరికొందరు ఎంపీలు ఈ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలకు ఆయన సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
విభజన చట్టం, హామీల అమలుపై నిత్యానంద రాయ్ కీలక ప్రకటన చేశారు. చాలా హామీలు ఇప్పటికే అమలు చేశామని, మరికొన్ని హామీలు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన వెల్లడించారు. మౌలిక సదుపాయాలు, విద్యాసంస్థల విషయంలో కేంద్ర నిర్ణీత కాలపరిమితి విధించిందని చెప్పారు. ప్రత్యేక రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్, తదితర అంశాలకు 2022లోనే రూ.106.89 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి మరో పది కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఇక, దుగ్గరాజుపట్నం పోర్టుకు బదులు రామాయపట్నం పోర్టు నిర్మిస్తామని చెప్పారు. ఆ పోర్టును మైనర్ పోర్టుగా నోటిఫై చేయాలని ఏపీ ప్రభుత్వం అడిగిందని వెల్లడించారు.
కడపలో స్టీల్ ప్లాంటు సాధ్యం కాదని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి చెప్పిందని ప్రకటించారు. ఎయిమ్స్, ఐఐటీ గిరిజన యూనివర్సిటీ, పోలవరం, రాజధాని నిర్మాణానికి 21 వేల కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్యవర్తిగా ఉంటుందన్నారు. కేంద్ర, ఏపీ, తెలంగాణ అధికారులతో విభజన హామీలు, చట్టం, సమస్యల గురించి 31 సమావేశాలు నిర్వహించామన్నారు. ఆ సమస్యలను ఇరు తెలుగు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు. క్యాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ పథకం కింద ఏపీకి పత్యేక సాయం అందిస్తున్నామని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates