అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ దుస్థితికి మీరంటే మీరు కారణమంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేసుకుంటూనే ఉన్నాయి. చంద్రబాబు హయాంలోనే ఏపీ అప్పుల కుప్పగా మారిపోయిందని వైసీపీ నాయకులు అంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయడం చేతకాక, అప్పులతో రాష్ట్రాన్ని జగన్ నడిపిస్తున్నారని టీడీపీ వాళ్లు గొంతెత్తున్నారు. మీ హయాంలో అప్పులు లెక్కలు ఇవి అంటూ పరస్పరం విమర్శించుకుంటున్నారు. అసలు ఎవరి ప్రభుత్వంలో ఎంత అప్పు అయిందనే విషయాన్ని కేంద్రం తాజాగా బయటపెట్టింది.
కేంద్రం లెక్కల ప్రకారం చంద్రబాబు ప్రభుత్వంలోనే ఎక్కువ అప్పులు చేసినట్లు తేలింది. లోక్‌సభలో బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు రాష్ట్రాల అప్పులపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం 2019 మార్చి నాటికి అంటే చంద్రబాబు ప్రభుత్వం దాదాపుగా ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2,64,451 కోట్లుగా ఉంది. అదే 2023 మార్చి నాటికి.. అంటే జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లకు బడ్జెట్ అంచనాల ప్రకారం ఆ అప్పు రూ.4,42,442 కోట్లకు చేరింది. అంటే ఈ నాలుగేళ్ల పాలనలో వైసీపీ దాదాపు రూ.1.77 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు కేంద్రం తేల్చింది.
వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ఏపీ వాటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ పేరుతో 2019-20లో రూ.1931 కోట్లు, ఏపీ రోడ్డు అభివృద్ధి కార్పోరేషన్ పేరుతో 2020-21లో రూ.1158 కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం చెప్పింది. 2022-23లో ఫిషరీస్ ఫండ్ నుంచి రూ.450 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల నిధి (2019-23) నుంచి రూ.6212 కోట్లు, వేర్ హౌసింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (2019-20) నుంచి రూ.11.40 కోట్లు, మైక్రో ఇరిగేషన్ ఫండ్ (2020-21) నుంచి రూ.616 కోట్లు అప్పు చేసినట్లు తేలింది. అలాగే క్రెడిట్ ఫెసిలిటీ ఫెడరేషన్స్ నుంచి రూ.24311 కోట్లు అప్పు తీసుకున్నట్లు చెప్పారు.