ర‌మేష్ హాస్పిట‌ల్ ఎండీ లైన్లోకొచ్చాడు

విజ‌య‌వాడ స్వ‌ర్ణ ప్యాలెస్‌లోని ర‌మేష్ కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో కొన్ని రోజుల కింద‌ట భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగి 12 మంది ప్రాణాలు కోల్పోవ‌డం సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ఆసుప‌త్రి సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐతే హాస్పిట‌ల్ ఎండీ ర‌మేష్ బాబు మాత్రం అదృశ్య‌మ‌య్యారు. ఆయ‌న కోసం కొన్ని ప్ర‌త్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాతి రోజు అండ‌ర్ గ్రౌండ్‌కు వెళ్లిపోయారు ర‌మేష్ బాబు. ఇప్పుడాయ‌న ఈ ఉదంతంపై ఓ ఆడియో సందేశాన్ని మీడియాకు విడుద‌ల చేశారు.

అగ్నిప్రమాద ఘటనపై విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని రమేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఘటనాస్థలిలో లేకున్నప్ప‌టికీ డాక్టర్‌ రాజగోపాల్‌, డాక్టర్‌ సుదర్శన్‌ల‌ను పోలీసులు నిర్బంధించడం సరికాదని.. అది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమ‌ని ఆయ‌నన్నారు. ఘటన జరిగిన రోజు నాడు తాను, ఆ డాక్టర్లు క‌లిసి కలెక్టర్‌ ఆఫీసులో కలెక్టర్‌ సమక్షంలో విచారణలో పాల్గొన్నామ‌ని ఆయ‌న తెలిపారు. త‌మ‌ ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమ‌ని.. నిష్పక్షపాత న్యాయవిచారణకు ఆస్పత్రి యాజమాన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ర‌మేష్ బాబు చెప్పారు.

త‌మ ఆసుప‌త్రిలో పది లక్షల మందికిపైగా హృద్రోగ చికిత్సలు చేయించుకున్నారని.. ఐదు వేల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు..త‌న‌ పేరు డాక్టర్‌ రమేశ్ ‌బాబు అని.. కానీ కొంతమంది ప్రజాప్రతినిధులు అందులో బాబుని తీసేసి చౌదరి అని తగిలించడం త‌న‌కెంతో బాధ కలిగించింద‌ని.. వైద్యానికి కుల, మత, రాజకీయాలను ఆపాదించడం సమంజసం కాద‌ని అన్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించాక.. చాలా మంది క్రిటికల్‌ స్టేజ్‌లో ఉన్న బాధితులు కూడా త‌మ‌ వైద్యసేవలతో కోలుకుని ఇళ్లకు వెళ్లారని. అయితే అనుహ్యంగా అగ్నిప్రమాద ఘటనతో త‌మ‌ ప్రయత్నాలన్నీ నిష్పలమయ్యాయని రమేశ్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు.