ఎవరు ఔనన్నా.. కాదన్నా.. ఎన్నికలు అనగానే.. పెట్టుబడులు కావాల్సిందే. ఓటు-నోటుకు మధ్య విడదీ యలేని బంధాన్ని పెంచేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికలు మరీ కాస్ట్లీగా మారిపోతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి. పార్టీలు,నాయకులు పైకి ఎన్ని మాటలు చెప్పినా.. అన్నింటి దారీ ఇదే నని అంచనా వేస్తున్నారు. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల అధికారుల వరకు అనేక చర్యలు తీసుకున్నా.. ఎలాంటి ఫలితం కనిపించడం లేదు.
కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రోజూ.. ఎక్కడో ఒక చోట కోట్లకు కోట్ల రూపాయలు పట్టు బడ్డాయి. ఇక, స్వయంగా మాజీ సీఎం, జేడీఎస్ అధినేత కుమారస్వామి.. తాము అనుకున్న విధంగా డబ్బులు పంచలేక పోయామని, తమకు ఇస్తామన్నవారు ఇవ్వలేదని వెల్లడించారు. దీనికి ముందు తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో.. ప్రజలే రోడ్ల మీదకు వచ్చి.. అక్కడ అంతిచ్చి.. ఇక్కడ ఇంతే ఇస్తారా? అని నాయకులను నిలదీసిన పరిస్థితి కనిపించింది.
అంటే ఏతా వాతా ఎలా చూసుకున్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుల జాతకాలు తేలేందుకు.. నిధుల కుమ్మరింత తప్పదనే సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇదిలావుంటే.. ఇతర ఖర్చుల విషయానికి వస్తే.. ఎంతటి నాయకుడైనా.. కార్యకర్తలే బలం. వారు తన వెంట తిరగకపోతే.. ఎంత నాయకుడైనా.. అభాసు కావాల్సందే. సో.. ఎన్నికల సమయంలో కార్యకర్తలు ఇక, ఊరికే రారు కదా! వారికి రోజుకు ఇంతని ఇవ్వాల్సిందే. మరోవైపు జెండాల ఖర్చు. ప్రచారాల ఖర్చు ప్రకటనల ఖర్చు.. ఇలా ఒకటా రెండా.. అనేక ఖర్చులు నాయకులకు ఎదురవుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపీలోనూ.. తెలంగాణలోనూ పొలిటికల్ పెట్టుబడుల అంశం నాయకుల మధ్య చర్చగా మారుతోంది. ఎన్నికల్లో ఎంత సొంత నిధులు ఖర్చు చేసినా అంతో ఇంతో అప్పులు చేయని నాయకులు లేరు. ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు.. అనే సామెత.. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి చూడు అనే మాటగా మారిపోయింది. దీంతో రియల్ వ్యాపారుల నుంచి భారీ కాంట్రాక్టర్ల వరకు.. ఆసాముల నుంచి ఇతర పెట్టుబడి దారుల వరకు నమ్మకమైన నాయకుల కు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
ఇక్కడ వారికి నోటు, పత్రాలు ఏమీ ఉండవు. కేవలం మాటే మంత్రం.. నమ్మకమే.. ఆయుధం. సో.. ఇలాంటికి అప్పులు ఇచ్చేందుకు పెట్టుబడి దారులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని నాయకుల మధ్య చర్చ సాగుతుండడం గమనార్హం. ఇదీ.. సంగతి!