సికింద్రాబాద్ బరిలో షర్మిల ?

ప్రస్తుత రాజకీయాలు చాలా స్పీడయిపోయాయి. ఏరోజు ఏమి జరుగుతోందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. నేతలు తాము పోటీచేయబో నియోజకవర్గాలను కూడా చాలా వేగంగా మార్చేస్తున్నారు. ఇదంతా ఇపుడు ఎందుకంటే రాబోయే తెలంగాణా ఎన్నికల్లో వైఎస్ షర్మిల సికిందరాబాద్ పార్లమెంటు స్ధానానికి పోటీచేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. షర్మిల ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని పాలేరు నుండి అసెంబ్లీకి పోటీచేయబోతున్నట్లు చాలాసార్లు ప్రకటించారు. అయితే అదంతా ఎప్పుడంటే వైఎస్సార్టీపీ అధినేతగా ఉన్నప్పుడు.

మరిప్పుడు ఏమైంది ? ఏమైందంటే తొందరలోనే తన పార్టీని షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విలీనం నిజమే అయితే షర్మిల పోటీచేయబోయే నియోజకవర్గం కూడా మారిపోతుందని అంటున్నారు. పాలేరు నుండి అసెంబ్లీకి కాకుండా సికిందరాబాద్ నుండి ఎంపీగా పోటీచేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పాలేరు నుండి పోటీచేయాలని అనుకుని అక్కడే పార్టీ ఆఫీసు కూడా నిర్మించుకుంటున్నారు. ఇపుడా నిర్మాణపనులు బాగా నెమ్మదించాయని సమాచారం.

కారణం ఏమిటంటే తాజా పరిణామాలే అని అంటున్నారు. సికిందరాబాద్ ఎంపీగా పోటీచేసే పక్షంలో పాలేరులో ఆఫీసు అవసరంలేదని షర్మిలే అనుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే కాంగ్రెస్ కు గాంధీభవన్ ఉన్నపుడు ఇక ప్రత్యేకించి వేరే ఆఫీసు అవసరంలేదు. ఎంపీగా గెలిస్తే అప్పుడు సికిందరాబాద్ లోనే సొంతంగా తనకు ఆపీసు ఏర్పాటు చేసుకోవాల్సుంటుంది. అందుకనే పాలేరు ఆఫీసు నిర్మాణం జోరు తగ్గించారట. సికిందరాబాద్ ఎంపీగా పోటీ చేయటం కన్ఫర్మ్ అయితే వెంటనే ఇక్కడే ఒక ఆఫీసు ఏర్పాటుచేసుకోవాలి.

ఆ చేసుకునేదేదో లోటస్ పాండ్ లోనే ఉన్న ఆపీసునే వాడుకోవచ్చని కూడా అనుకుంటున్నారట. అంటే సికిందరాబాద్ ఎంపీ ఆఫీసుగానే లోటస్ పాండ్ లో ఇపుడున్న ఆఫీసును వాడుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తానికి షర్మిల తరపున సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. మొదలగా కర్నాటక డిప్యుటీ సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ మొదలుపెట్టిన విలీనం ప్రయత్నాలను ఇపుడు కేవీపీ అందుకున్నారట. మరి చివరకు ఏమి తేలుతుందో చూడాల్సిందే.