దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈరోజు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కొన్నాళ్ల కిందట అరెస్టయి.. జైల్లో ఉన్న ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే రెండు సార్లు వాదనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు మంగళవారం తొలికేసుగా పరిగణించి విచారించింది. ఈ క్రమంలోనే రాఘవరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
అయితే.. ఈ బెయిల్ పిటిషన్‌పై గతంలో స్పందించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ, తాజాగా రాఘవరెడ్డి తరఫు న్యాయవాది.. అనారోగ్య కారణాలు కోర్టుకు చూపడంతో షరతులతో కూడిన నాలుగు వారాల బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. అయితే ఈసారి రాఘవకు బెయిల్ ఇవ్వడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించకపోవడం గమనార్హం.
గతంలో ఢిల్లీ హైకోర్టు రాఘవ రెడ్డికి బెయిల్ ఇచ్చింది. కానీ, దాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పట్లో బెయిల్ రద్దు చేసింది. ఇక, మంగళవారం మాత్రం మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ తరఫున న్యాయవాదులు వ్యతిరేకించలేదు. ఇదిలావుంటే.. ఈ కేసులో ఈడీ అధికారులు విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరుకావాలని హైకోర్టు రాఘవరెడ్డికి షరతులు విధించింది.
అయితే.. దీనికి సంబంధించి రెండు ప్లేస్‌లు డిక్లేర్ చేసింది. ఢిల్లీ లేదా చెన్నై కార్యాలయాల్లో విచారణకు హాజరుకావచ్చని తెలిపింది.అదేసమయంలో చెన్నై వెళ్లినా.. అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లకూడదని ఢిల్లీ హైకోర్టు షరతులు విధించింది. పాస్‌పోర్టును ఇప్పటికే స్వాధీనం చేసుకున్న దరిమిలా.. దానిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.
కాగా, లిక్క్ స్కామ్‌కు సంబంధించి సౌత్ గ్రూప్‌లో రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడీ అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆప్ నేతలకు చేరిన 100 కోట్ల రూపాయల్లో ఈ యన ప్రమేయం ఉందని కూడా తెలిపింది.