ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై వైసీపీ నేత, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ నాలుకను 1000 సార్లు కోస్తామని సుధాకర్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. వాలంటీర్లపై తన వ్యాఖ్యలను పవన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పవన్ తైతక్కలాడితే చూసిన అభిమానులకు కూడా వాలంటీర్ల ద్వారానే పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. జన్మభూమి కమిటీలను మళ్లీ తీసుకురావాలని పవన్ కోరుకుంటున్నారా? వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని ఆయన అనుకుంటున్నారా? అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీలపై పవన్ ధర్నాలు చేసిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు ఆడించినట్టుగా పవన్ ఎందుకు ఆడుతున్నారో అర్థం కావట్లేదని ఆయన అన్నారు.
చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు పవన్ తపించడం ఏమిటో అని ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై హ్యూమన్, ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేసిన పవన్ పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 18 వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అన్న పవన్ వాటికి ఆధారాలు చూపాలని, లేదంటే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి, సుధాకర్ బాబు వ్యాఖ్యలపై జనసేన నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates