వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే నిర్వేదం..

పొలిటిక‌ల్ జంప్ జిలానీగా పేరు తెచ్చుకున్న ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తీవ్ర నిరాశ‌లో కూరుకు పోయారా? రెడ్డి సామాజిక వ‌ర్గం నాయ‌కుల డామినేష‌న్‌ను ఆయ‌న త‌ట్టుకోలేక పోతున్నారా? ఈ ప‌రిణామాలతో ఆయ‌న ఏకంగా వ‌చ్చే ఎన్నిక‌ల నుంచి పోటీకి త‌ప్పుకోవాల‌ని భావిస్తున్నారా? అంటే.. స్వ‌యంగా ఆయ‌నే ఔన‌ని చెప్పారు. తాజాగా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కంభం మండ‌లంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర నిర్వేదం వ్య‌క్తం చేశారు.

“రాజ‌కీయాలంటే.. ఇలా కూడా ఉంటాయా? అని అనిపిస్తోంది. నేను రెడ్ల‌కు ఏం ద్రోహం చేశాను. కానీ..న‌న్ను విల‌న్‌గా చూపిస్తున్నారు. నేను రెడ్డి వ‌ర్గాన్ని ఎక్క‌డైనా ఎప్పుడైనా విమ‌ర్శించానా? నాకు టికెట్ ఇచ్చింది మ‌న జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి కాదా! అయినా..రెడ్లు న‌న్ను దూరం పెడుతున్నారు. ఈ ప‌రిణామాలు చూస్తే..రాజకీయాలంటేనే విసుగు వ‌స్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీరే పోటీ చేసుకుంటానంటే నేను సంతోషంగా త‌ప్పుకుంటా. నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సంపాయించుకున్న‌ది ఏమీ లేదు. పోగొట్టుకున్న‌దే ఎక్కువ‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని లేదు” అని అన్నా వ్యాఖ్యానించారు.

ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం విష‌యాన్ని చూస్తే.. రాష్ట్రంలో సీఎం జ‌గ‌న్ సాధించిన ల‌క్ష ఓట్ల మెజారిటీ త‌ర్వాత‌.. అన్నా రాంబాబు రెండో ప్లేస్‌లో నిలిచారు. ఈయ‌న దాదాపు 81 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కించుకున్నారు. దీంతో ఇక్క‌డ నుంచి పోటీ చేసేందుకు రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రుకీల‌క నాయ‌కులు రెడీ అవుతున్నార‌నే వార్త‌లు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. ఇక‌, అధిష్టానం ప‌రంగా కూడా.. అన్నాను దూరం పెట్టారు. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌క‌పోవ‌డంపై గ‌త ఏడాది ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. పైగా జ‌న‌సేన కు ట‌చ్‌లో ఉంటున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో పార్టీ అధినేత కూడా ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని తెలిసిందే. మొత్తంగా ఇప్పుడు అన్నా తీవ్ర నిర్వేదంలో అయితే ఉన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీ నుం చ‌విజ‌యం ద‌క్కించుకున్నారు.