నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ నేత మండవ వెంకటేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మండవకు అత్యంత సన్నిహితుడు, శిష్యసమానుడైన మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ లో చేరినప్పటినుంచి మండవ కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. టీడీపీలో చాలా సీనియర్ గా ఉన్న మండవ వాస్తవానికి కేసీఆర్ కు కూడా అత్యంత సన్నిహితుడనే చెప్పాలి.
అటువంటి మండవను కేసీఆర్ స్వయంగా నిజామాబాద్ లో ఇంటికి వెళ్ళి మరీ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. అప్పట్లో, మండవ ఇంటికి వెళ్ళి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సౌమ్యుడు, వివాదరహితుడు అయిన మండవకు అన్ని పార్టీలు గౌరవమిస్తాయి. అలాంటి మండవను కేసీఆర్ పార్టీలోకి తీసుకోవడంతో ఈ సీనియర్ నేత దశ తిరిగిపోయినట్లేనని అంతా అనుకున్నారు. కానీ, తీరాచూస్తే మండవ బీఆర్ఎస్ లో ఉన్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు, మండవను కేసీఆర్ ఎందుకు పార్టీలో చేర్చుకున్నారు ? ఎందుకని ఏ బాధ్యతలు, పదవులు ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టారు? అన్న విషయాలు ఎవరికీ అర్ధం కావడం లేదు. చాలాకాలంగా బీఆర్ఎస్ లో సైలెంటుగా ఉన్న మండవ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఒక్కసారిగా ప్రచారం జోరందుకుంది. రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా మండవ బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డిపై పోటీకి మండవ రంగంలోకి దిగబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
నిజంగానే మండవ గనుక కాంగ్రెస్ లో చేరితే టీడీపీ క్యాడర్ మొత్తం కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం ఖాయమని టాక్ వస్తోంది. చాలాసార్లు ఎంఎల్ఏగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన మండవ వివాదరహితుడిగా పేరున్న నేత. ఇలాంటి నేత వెళితే కేసీఆర్ కు ఎన్నికలకు ముందు భారీ షాక్ అనే చెప్పాలి. అసలు టీడీపీలో నుండి మండవను బీఆర్ఎస్ లోకి ఎందుకు చేర్చుకున్నారో కూడా ఇప్పటికీ అర్ధం కావడం లేదు. 2019 ఎన్నికల నుండి మండవ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. మరి మండవ గనుక కాంగ్రెస్ లో చేరితే ఆ పార్టీకి ప్లస్ అవుతుందా? మైనస్ అవుతుందా? అన్నది తేలాల్సి ఉంది.