రాబోయే ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన లేదా బీజేపీ, జనసేన లేదా బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఉండే అవకాశాలున్నాయని చాలాకాలంగా పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తులు ఉండబోవన్న రీతిలో తాజాగా బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జీ సునీల్ దేవధర్ సంచలన విమర్శలు చేశారు. దివంగత ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని, బాహుబలి వంటి ఆయనను కట్టప్ప మాదిరి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
2014లో బీజేపీతో కలిసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత బీజేపీకి వెన్నుపోటు పొడిచి బయటకు వెళ్లారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందని అన్నారు. పురందేశ్వరి నాయకత్వంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని, రాష్ట్రంలో బీజేపీ – జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, టీడీపీతో బీజేపీ పొత్తుపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీపై విశ్వసనీయత లేదని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.
ఏపీ బీజేపీ చీఫ్ గా పురందేశ్వరి నియామకం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అని జీవీఎల్ అన్నారు. 2024లో బీజేపీ, జనసేన అధికారంలోకి రానున్నాయని ,20 ఎంపీ స్థానాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. మరోవైపు, ఈ ఇద్దరు నేతలు చేసిన కామెంట్లకు భిన్నంగా ఏపీ బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ సంకేతాలిచ్చిందని, కేంద్రం సంకేతాలివ్వకుంటే తాను ఎందుకు మాట్లాడతానని అన్నారు.
పొత్తుల విషయంలో చర్చలు జరుగుతున్నాయని, జగన్ కు కేంద్రం నుంచి సహకారం లేదని అన్నారు. సీబీఐ కేసుల నుంచి జగన్ ను బీజేపీ కాపాడుతోందనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఈ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు గందరగోళం కలిగించినా…టీడీపీని బీజేపీ దూరం పెడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.