ఏపీలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. పవన్ వాలంటీర్లను టార్గెట్ చేసి మాట్లాడుతున్న వైనం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో మరోసారి వాలంటీర్లపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లలో కొందరు కిరాతకులున్నారని, వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ గారు నమస్కారమండి…నేను పవన్ కల్యాణ్ నండి…ఆయ్…తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నానండి…అంటూ గోదారి యాసలో జగన్ పై పవన్ సెటైర్లు వేశారు.
ఇక, జగన్ సంస్కారహీనుడు అని, తన గురించి ఆయన దిగజారి మాట్లాడుతున్నా జగన్ భార్య భారతి గురించి తాను మాట్లాడలేదని అన్నారు. ముఖ్యమంత్రి పదవికి జగన్ అనర్హుడని ఏకవచనంతో పవన్ విమర్శలు గుప్పించారు. అయితే, వాలంటీర్లంతా చెడ్డవారని తాను అనలేదని, ఆ వ్యవస్థ పనితీరును తప్పుబట్టానని చెప్పారు. వాలంటీర్లు తన సోదరుల వంటి వారని చెప్పుకొచ్చారు. అయితే, డబ్బులు తీసుకొని పనిచేస్తే వాలంటీర్లు కారని అన్నారు. వాలంటీర్ల జీతం భూమ్ భూమ్ కు ఎక్కువ…ఆంధ్రా గోల్డ్ కు తక్కువ అని సెటైర్లు వేశారు. వాలంటీర్లు సేకరించిన డేటా అంతా హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఎందుకు ఉందని ప్రశ్నించారు.
వైసీపీ అధినేత జగన్ క్రిమినల్ అని, ఆయన జైలుకు వెళ్లొచ్చారని పవన్ విమర్శించారు. జగన్ ను కొందరు వాలంటీర్లు ఆదర్శంగా తీసుకొని జగన్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత సీఎం అయ్యారని, తాము కూడా ఏదైనా నేరం చేసినా తర్వాత రాజకీయాలలోకి రావచ్చు అన్న ధీమా కొందరు వాలంటీర్లలో కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ సోదరులు, సోదరీమణులకు మళ్లీ చెబుతున్నానని, తనకు వాలంటీర్లపై వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. కానీ, వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న విధానంపైనే తన పోరాటమని పవన్ స్పష్టం చేశారు.