ఇది చాలా పెద్ద డ్యామేజీ జగన్!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. నిన్న ఉన్న‌ట్టు ఈ రోజు.. ఈ రోజు ఉన్న‌ట్టు రేపు ఉండాల‌ని లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. సొంత గూటిలో రేపుతున్న మంట‌లు కూడా .. ఒక్కొక్క సారి పార్టీల‌కు పెను ప్ర‌మాదం తెచ్చే అవ‌కాశం మెండుగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా అధికార వైసీపీలో ఇదే జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో వైసీపీ ప‌రిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంది.

వివిధ ర‌కాల ప‌న్నులు పెంచ‌డం.. ముఖ్యంగా చెత్త‌పై ప‌న్ను విధింపు, పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు, రిజిస్ట్రేష‌న్ చార్జీల పెంపు.. ఇలా అనేక రూపాల్లో ప్ర‌జ‌లు ఒకింత ఆగ్ర‌హంతోనే ఉన్నారు. ఇక‌, ఉద్యోగుల ప‌రిస్థితి న‌ర్మ‌గ‌ర్భంగా ఉంది. ఇదిలావుంటే.. వైసీపీ నాయ‌కులు ఎక్కువ‌గా గ్రామీణ ఓటు బ్యాంకుపై ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ గ్రామీణ స్థాయిలో ప‌క్కాగా దూసుకుపోవాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేసి.. దానిని సాధించార‌నే చెప్పాలి. లేక‌పోతే.. ఇంత భారీ మెజారిటీ వ‌చ్చేది కాద‌ని కూడా.. నిపుణులు చెప్పిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇప్పుడు అదే గ్రామీణ భార‌తంలో వైసీపీకి వ్య‌తిరేకంగా చేతులు క‌లుపుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా గ్రామ పంచాయ‌తీల స‌ర్పంచులు స‌ర్కారు వైఖ‌రిపై ఆగ్ర‌హంతో ఉన్నారు. తాజాగా విజ‌యవాడ‌లో నిర్వ‌హించిన పంచాయతీ సంఘాల సమావేశంలో సంచ‌ల‌నం జ‌రిగింది. గ‌తంలోనూ ఇలాంటి స‌మావేశాలు జ‌రిగినా.. వైసీపీ అనుబంధం సంఘంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయ‌తీ స‌ర్పంచుల సంఘం దూరంగా ఉంది.

కానీ, తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయ‌తీరాజ్ చాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో సీపీఐ, టీడీపీ, సీపీఎం.. ఇతర పార్టీలు నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో వైసీపీ అనుబంధం సర్పంచుల సంఘం కూడా చేతులు క‌లిపింది. పంచాయ‌తీ నిధుల‌ను స‌ర్కారు వాడుకుంటోంద‌ని.. త‌మ‌కు క‌నీసం వ‌లంటీర్ల‌కు ఇస్తున్న విలువ కూడా ఇవ్వ‌డం లేద‌ని స‌ర్పంచులు వాపోయారు. అంతేకాదు.. వ‌లంటీర్ల‌కు రూ.5000 చొప్పున గౌర‌వ వేత‌నం ఇస్తుంటే.. త‌మ‌కు 3 వేలు కూడా ద‌క్క‌డం లేద‌ని విమ‌ర్శించారు.

విధులు, నిధులు.. వంటివి లేకుండా పోయాయ‌ని ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల‌తో చేతులు క‌లిపి.. ప్ర‌భుత్వంపై ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. గ్రామీణ స్తాయిలో అన్ని పంచాయ‌తీల్లోనూ ఇంటింటికీ తిరిగి.. స‌ర్కారు తీరును వివ‌రిస్తామ‌ని కూడా వెల్ల‌డించారు. క‌ట్ చేస్తే.. ఇదే క‌నుక జ‌రిగితే.. వైసీపీ గ్రామీణ ఓటు బ్యాంకుపై ప్ర‌భావం ప‌డ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికైనా దీనిని స‌రిదిద్ది.. పంచాయ‌తీస‌ర్పంచుల ఆగ్ర‌హాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయాల‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.