పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలని కేసీయార్ డిసైడ్ అయ్యారు. విభజించు పాలించు అనే పద్దతిలో కేంద్రం తీసుకురాబోతున్న బిల్లును ఎట్టిపరిస్ధితులోను సమర్ధించేదిలేదని కేసీయార్ చెప్పారు. బిల్లును ఏరూపంలో తీసుకొచ్చినా కచ్చితంగా వ్యతిరేకిస్తామని కేసీయార్ స్పష్టంగా చెప్పేశారు. కామన్ సివిల్ కోడ్ బిల్లు విషయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసుదుద్దీన్ ఓవైసీ తదితరులతో కేసీయార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిల్లును వ్యతిరేకించాలన్న నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో ప్రత్యేకత కలిగిన జాతులు, గిరిజన తెగలు, ప్రాంతాలు, మతాలు అనేకమున్నట్లు కేసీయార్ అభిప్రాయపడ్డారు. వీళ్ళందరినీ మత ప్రాతిపాదికగా చీల్చేసి అశాంతిని రేకెత్తించే బిల్లును వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మతాల మధ్య విభజనను ప్రోత్సహించే బిల్లులకు ఎట్టి పరిస్ధితుల్లోను మద్దతిచ్చేది లేదని తేల్చిచెప్పారు. మతాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని కేసీయార్ హెచ్చరించారు.
మొత్తానికి బిల్లు ప్రవేశపెడితే చివరకు ఏమిచేస్తారో తెలీదు కానీ ఇప్పటికైతే నరేంద్రమోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిల్లును వ్యతిరేకించబోతున్నట్లు కేసీయార్ నిర్ణయించారు. అధికారికంగా ఈ మేరకు నిర్ణయం బహిరంగంగా ప్రకటించకపోయినా లీకుల రూపంలో సమావేశం వివరాలను బయటకు వదిలారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా నరేంద్రమోడీపై వ్యతిరేకంగా కేసీయార్ నోరిప్పి చాలా కాలమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు కవిత అరెస్టు విషయంలోనే కేసీయార్ కేంద్రంతో రాజీపడిపోయినట్లు వార్తలు తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్రం అన్నా మోడీ అన్నా కేసీయార్ చాలా సాఫ్ట్ గా వెళుతున్నారు.
ఒకపుడు మోడీపై అడ్డుగోలుగా విరుచుకుపడిన కేసీయార్ ఇపుడు వ్యతిరేకంగా మాట్లాడటానికే ఇష్టపడం లేదు. కారణం ఏమిటంటే కవితను ఈడీ అరెస్టు చేయకుండా ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నేతలు పదేపదే టార్గెట్ చేస్తున్నారు. తెరవెనుక ఏదో జరిగిందనే అనుమానాలైతే జనాల్లో బాగా పెరిగిపోయాయి. అందుకనే ఈడీ కవితను అరెస్టు చేయటంలేదు. మోడీకి వ్యతిరేకంగా కేసీయార్ నోరిప్పటంలేదు. సరిగ్గా ఈ సమయంలోనే పార్లమెంటు వర్షాకాలా సమావేశాల్లో కామన్ సివిల్ కోడ్ బిల్లును కేంద్రం ప్రవేశపెడుతోంది. అందుకనే కేసీయార్ ఇంతకాలానికి నోరిప్పి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.