మాట‌ల తూటాలు పేల్చే మంత్రి గారు త‌డ‌బ‌డ్డారే.. !

ఆయ‌న నోరు విప్పితే.. మాట‌ల తూటాలు పేల‌తాయి. ప్ర‌తిప‌క్ష నాయకుల‌పై అన‌ర్గ‌ళంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌గ‌ల ఫైర్ బ్రాండ్ మంత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌నే అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌. ఆయ‌న మాట్లాడితే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. అనూహ్యంగా చిన్న విష‌యంలో ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. ముందు ఒక మాట‌.. త‌ర్వాత మ‌రో మాట మాట్లాడారు. ఈ స‌వ‌ర‌ణ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఏంటంటే.. విశాఖలోని ప్ర‌ఖ్యాత రుషి కొండ బీచ్లో సాధార‌ణ పౌరులు కాల‌క్షేపం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌వేశ రుసుము పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే,.. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇటు మీడియా, అటు ప్ర‌జా సంఘాలు.. స్థానికుల నుంచి కూడా వ్య‌తిరేక‌త ఎదురైంది. దీంతో ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చేందుకు మంత్రి అమ‌ర్నాథ్ మీడియా ముందుకు వ‌చ్చారు. రుషి కొండ‌లో ప్రవేశానికి రూ.20 ఫీజు నిర్ణయించామ‌ని ముందు చెప్పారు.

రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉందని, జియెగ్రాఫికల్ ఐడెంటిటీ (జీఐ) కలిగిన ఈ బీచ్ నిర్వహణ, ఆ గుర్తింపును మరింతగా మెయింటెయిన్ చేయాలనే ఉద్దేశంలో ప్రవేశ రుసుము పెట్టాలని నిర్ణయించి ఉండొచ్చని మంత్రి గుడివాడ వ్యాఖ్యానించారు. అయితే.. మ‌ళ్లీ ఏమ‌నుకున్నారో ఏమో.. మరో కొద్దిసేప‌టి త‌ర్వాత‌ మీడియా ముందుకొచ్చి ఆ వ్యాఖ్యలను వెన‌క్కి తీసుకున్నారు. బీచ్ నిర్వహణకు రుసుము అవసరం ఉందని మాట్లాడిన ఆయ‌న‌ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ రుషి కొండా బీచ్ కు ప్రవేశ రుసుము అవసరం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల ఫీజు నిర్ణాయక అంశం చర్చకు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుషి కొండ బీచ్ ప్ర‌వేశ రుసుము పెట్టాల‌నే ఆలోచన కూడా లేదని తెలిపారు. అయితే.. దీనిపై వ్య‌తిరేక‌త రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. మొత్తానికి ఆయ‌న త‌డ‌బాటుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.