ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న ఏపీ మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సస్పెన్షన్లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు కుటుంబ కార్యక్రమాల కోసం తాను అమెరికాకు వెళ్లాలని ఏపీ సీఎస్, డీజీపీ రాజేంధ్రనాథ్రెడ్డికి తెలిపారు. అయితే, ఏబీవీకి అనుమతిని ఏపీ సీఎస్ నిరాకరించారు. దీంతో, ఈ విషయంపై హైకోర్టు ఇప్పటికే 2 సార్లు విచారణ జరిపింది. విదేశీ ప్రయాణం ప్రాథమిక హక్కు అని, బలమైన నేరం ఉంటే తప్ప ఆ హక్కును హరించే అధికారం లేదని గతంలో ఆదేశాలిచ్చింది. అయినా సరే ఏబీవీకి ఏపీ సర్కార్ అనుమతినివ్వలేదు.
దీంతో, తాజాగా గురువారం ఆ వ్యవహారంపై మరోసారి విచారణ జరిగింది. ఏబీవీని సస్పెండ్ చేశామని, ఆయనపై కేసులున్నందున విదేశాలకు వెళ్లేందుకు అనుమతించబోమని చెప్పింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై జడ్జి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాథమిక హక్కుల గురించి మీరు చదువుకున్నారా? అని ప్రభుత్వ తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. ఆ హక్కుల విలువ, అవసరం తెలుసా? లేక అన్నీ తెలిసే ఇలా చేస్తున్నారా? అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఏబీవీ విదేశీ ప్రయాణానికి అనుమతిస్తున్నామని ఏపీ సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది.
అదే సమయంలో ప్రభుత్వానికి ఏబీవీ కూడా సహకరించాలని ఆదేశించింది. నిర్దేశిత గడువులోగా తిరిగి రావాలని ఏబీవీ తరఫు లాయర్ కు చెప్పింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఏబీవీ విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. మరి, ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా కోర్టు తాజా ఆదేశాలతో జగన్ కు షాక్ తగిలినట్లయింది.