క‌రోనా కంటే జ‌గ‌నే డేంజ‌ర్‌.. దానికి చంద్ర‌బాబే వ్యాక్సిన్‌: లోకేష్

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో టీడీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేశారు. కరోనా కంటే జగనోరా వైరస్ ప్రమాదకరమని, ఈ వైరస్ అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిందని వ్యాఖ్యానించారు. ఈ వైర‌స్ నిర్మూల‌న‌కు చంద్ర‌బాబు వ్యాక్సిన్ స‌రైంద‌న ఔష‌ధ‌మ‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల‌ వ్యాపారస్తులు కూడా జగనోరా వైరస్ బాధితులేనని, జగనోరా వైరస్కి వ్యాక్సిన్ చంద్రబాబేనని చెప్పారు. యువగళం పాదయాత్ర 147వ రోజు ఉమ్మ‌డి నెల్లూరులోని కోవూరు నియోజకవర్గంలో కొనసాగింది.

సాలుచింతల విడిది కేంద్రం వద్ద వ్యాపారులతో నారా లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. స్టౌవ్‌బీడీ కాలనీ, పడుగుపాడు, కోవూరు బజారు, మండబైలు, గుమ్మలదిబ్బ, పాతూరు, దామరమడుగు, ఆర్‌ఆర్‌.నగర్‌, కాగులపాడు, రేబాల కూడలి మీదుగా పాదయాత్ర కొనసాగింది. వ్యాపారస్తులు తమ సమస్యలను లోకేష్‌కు విన్నవించారు. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే చూశామని, త్వరలో వ్యాపారస్తులు బిజినెస్ హాలిడే ప్రకటించే ప్రమాదం కూడా ఉందని నారా లోకేష్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

జగన్ సొంత పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తా బండిలో గంజాయి పెట్టి వేధించారని నారా లోకేష్ ఆరోపించారు. పన్నులు, విద్యుత్ ఛార్జీలు, పెంచి వ్యాపారస్తులను, రైస్ మిల్లర్లను జగన్ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. జ‌గ‌న్‌ ప్రభుత్వం పెంచేసిన పన్నులు, విద్యుత్ చార్జీలను టీడీపీ అధికారంలోకి రాగానే తగ్గిస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకునేందుకు అయ్యే ఖర్చులు, పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తామని ప్రకటించారు.

బియ్యం ఎగుమతులు కోసం కేంద్రం వసూలు చేస్తున్న పన్నులను, చిరు వ్యాపారస్తులు జీఎస్టీ రిటర్న్స్ చెల్లింపుల్లో నిబంధనలను సడలించేలా టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారని లోకేష్ తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు, వ్యాపారస్తులకు సాయం అందిస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి గతంలో తాము ఇచ్చిన సబ్సిడీలను పునరుద్ధరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.