ఏపీ డిప్యూటీ స్పీకర్ టాలెంట్ చూసి పార్టీ నేతలే షాకవుతున్నారు

‘కటౌట్ చూసి కొన్ని నమ్మాలి డ్యూడ్’ అంటుంటాం కానీ.. కొందరి విషయంలో మాత్రం ఇది ఏమాత్రం పనిచేయదు. కటౌట్‌కి వాళ్లు చేసే పనులకు, చూపించే సత్తాకు ఏమాత్రం మ్యాచ్ కాదు. అలాంటి లిస్ట్‌లో వేయాల్సిన వారిలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం ఎమ్మెల్యే అయిన కోలగట్ల వీరభద్రస్వామి పేరు చెప్పాలి. విజయనగరం రాజకీయాలలో తప్ప ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా పెద్దగా చర్చల్లో ఉండదు. కానీ కొద్దివారాలుగా ఆయన పేరు మార్మోగుతోంది. ముఖ్యంగా యోగా డే, నేషనల్ స్విమింగ్ డే, ఆ తరువాత ఒకట్రెండు సందర్భాలలో ఆయన చేసిన ఫీట్లతో అందరినీ ఆశ్చర్యపరిచారాయన.

కోలగట్ల వీరభద్రస్వామిది భారీకాయం. ఎత్తు సాధారణంగానే ఉన్నా పొట్ట, భారీ శరీరంతో కనీసం 100 కిలోలు ఉంటారని చూడగానే అనుకుంటారు ఎవరైనా. అయితే.. శరీరాకృతికి మనిషి సామర్థ్యాలకు సంబంధం ఉండదని నిరూపిస్తున్నారాయన. స్విమింగ్ పూల్‌లో దిగి చేపలా ఈత కొట్టడమే కాదు ఎంతో సాధన చేస్తే తప్ప సాధ్యం కాని జలాశనాలను సునాయాసంగా వేస్తున్నారాయన. స్విమింగ్ పూల్‌లో వెల్లకిలా పడుకుని నీటిపై తేలి కదలకుండా చాలా సమయం ఉంటున్నారు. అంతేకాదు… కదలకుండా నీటిపై తేలుతూ యోగాసనాలు కూడా వేస్తుండడంతో విజయనగరం ప్రజలే కాదు ఆ వీడియోలు సోషల్ మీడియాలో చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. కోలగట్లకు ఈ టాలెంట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా ఆయన విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్‌‌లో ఇలా నీటిపై ఆసనాలు వేయడంతో అక్కడి అధికారులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. అంతకుముందు కూడా ఆయన పలుమార్లు ఇలాంటి ఫీట్లు చేశారు. కాగా విజయనగరం జిల్లాకు చెందిన కోలగట్లకు పూసపాటి అశోక్ గజపతి రాజును ఓడించిన నేతగా పేరుంది. ఆ కారణంగానే వైసీపీలో జగన్ కూడా ఆయనకు ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం ఇవ్వలేకపోయినా డిప్యూటీ స్పీకరుగా అవకాశం ఇచ్చారు.