జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలి విడత దిగ్విజయంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జులై 9 నుంచి ఏలూరులో రెండో విడత వారాహి యాత్ర చేసేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. తొలివిడత వారాహి యాత్ర సందర్భంగా సీఎంతో పాటు వైసీపీ నేతలపై పవన్ పదునైన విమర్శలు గుప్పించారు. దీంతో, పవన్ పై ప్రతి విమర్శలు చేసే క్రమంలో సీఎం జగన్. సహా వైసీపీ నేతలంతా వ్యక్తిగత విమర్శలకు, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అని ఆరోపణలు వస్తున్నాయి.
పవన్ పెళ్లిళ్ల గురించి ఏకంగా జగన్ బహిరంగ సభలో ప్రస్తావించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఘటనపై మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు చేగొండి హరిరామజోగయ్య స్పందించారు. జగన్ కు ఆయన తాజాగా బహిరంగ లేఖ రాశారు. వైఎస్సార్ హుందాతనంలో మీకు పదో వంతు కూడా రాలేదనిపిస్తోందని జగన్ కు ఆయన చురకలంటించారు. అసలు వైఎస్ కే జగన్ పుట్టారా అనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ తో తనకు సన్నిహిత సంబంధాలుండేవని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్ష నేతలపై వైఎస్సార్ హుందాగా విమర్శలు గుప్పించేవారని ఆయన అన్నారు. ప్రతిపక్ష నాయకుడైన పవన్ పై జగన్ చేస్తున్న వ్యక్తిగత విమర్శలను విన్న తర్వాత సినిమాలలో విలన్ పాత్రలో జగన్ ను ఊహించుకోవాల్సి వస్తుందని అన్నారు. పవన్ పై బురదజల్లేందుకు వేరే కారణాలు లేక ఇలా చౌకబారు కారణాలు వెతుక్కుంటున్నారని ఆరోపించారు. మరోసారి ఇటువంటి చౌకబారు విమర్శలు చేయొద్దని, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సున్నితంగా హెచ్చరించారు
పవన్…. చంద్రబాబు దత్తపుత్రుడని విమర్శిస్తుంటారని, కానీ, కేసీఆర్ దత్తపుత్రుడిగా 2019లో ఓటర్లను కొనేందుకు కోట్లాది ప్యాకేజీ తీసుకొని ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టలేదా అని ప్రశ్నించారు. రాజారెడ్డి మొదలు జగన్ వరకు దోచుకోవడం, దాచుకోవడం అలవాటేనని….కాదని చెప్పే దమ్ముందా అని జగన్ ను నిలదీశారు. స్వపక్షమైనా, విపక్షమైనా కుండబద్దలు కొట్టడం తన నైజం అని, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజాభిప్రాయాన్ని ఇలా లేఖ రూపంలో రాశానని సారీ అంటూ తన లేఖను ముగించారు. మరి ఈ లేఖపై వైసిపి నేతల స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates