షర్మిలపై కేవీపీ ఇలా..జానారెడ్డి అలా…

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల సాధన కోసమే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ స్థాపించినట్టుగా ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, కొంతకాలంగా కాంగ్రెస్ నేతలతో వైఎస్ షర్మిల టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు తీవ్రంగా కృషి చేసిన డీకే శివకుమార్ తో షర్మిల భేటీ కావడంతో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయబోతున్నారన్న పుకార్లు వస్తున్నాయి. ఆ పుకార్లకు ఊతమిచ్చేలాగా వైయస్సార్ ఆత్మ, మాజీ ఎంపీ కెవిపి రామచంద్రరావు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని, ఆ విషయంపై తనకు సమాచారం ఉందని కెవిపి షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, కాంగ్రెస్ లో చేరేందుకు షర్మిల కొన్ని షరతులు పెట్టారని, ఈ రోజో రేపో ఆ చర్చలు కొలిక్కి వస్తే పార్టీలో చేరుతారని ముమ్మరంగా ప్రచారం జరుగుతుంది.

ఈ క్రమంలోనే షర్మిలతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చర్చలు జరిపారని, రాహుల్ గాంధీ దగ్గరకు జానారెడ్డితో షర్మిల రాయబారం పంపారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై పీసీసీ చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి స్పందించారు. ఆ ప్రచారంలో నిజం లేదని, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు నిజం కాదని అన్నారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను మాత్రమే నిర్వర్తిస్తానని, ఇటువంటి మధ్యవర్తిత్వం చేయనని జానారెడ్డి తెగేసి చెప్పారు. ఓవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అని కేవీపీ చెబుతుంటే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన విషయం నిజం కాదని జానారెడ్డి చెప్పటం గందరగోళానికి దారి తీస్తోంది.

అంతకుముందు తాను తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని షర్మిల తేల్చేశారు. ఏపీ కాంగ్రెస్‌లోకి వస్తారని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపారేశారు. కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా ఇదే విషయాన్ని షర్మిల తేల్చి చెప్పారట. కానీ, ఏపీకి చెందిన షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్ లో చోటు లేదని రేవంత్‌ రెడ్డి వర్గం చెబుతోంది. షర్మిల చేరిక విషయం ఏపీ కాంగ్రెస్ చూసుకుంటుందని, తెలంగాణకు సంబంధం లేదని రేవంత్ స్వయంగా క్లారిటీనిచ్చారు. అయితే, షర్మిల చేరిక పట్ల సానుకూలంగా ఉన్న భట్టి, ఇతర నేతలు అధిష్టానం దగ్గర లాబీయింగ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. రాహుల్‌ ఖమ్మం టూర్‌ సందర్భంగా కూడా షర్మిల విషయం చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. రాహుల్ తో కారులో గన్నవరం వరకు వెళ్లిన భట్టి…ఆయనతో షర్మిల విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది.