రెండో విడత వారాహి పరుగు ఇక్కడి నుంచే

జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర మొదటి విడత దిగ్విజయంగా పూర్తయిన సంగతి తెలిసిందే. అన్నవరం నుంచి భీమవరం వరకు జనసేనాని చేపట్టిన ఈ యాత్ర అన్ని రకాల అడ్డంకులను అధిగమించి అప్రతిహతంగా కొనసాగింది. తొలి విడత యాత్రలో వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలపై పవన్ పదునైన విమర్శలు గుప్పించారు. ఏపీలో పవన్ చేపట్టిన వారాహి యాత్ర అధికార పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిందని జనసేన నేతలు అంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా వారాహి యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత వారాహి యాత్రను పవన్ ప్రారంభించబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలోని 34 నియోజకవర్గాలలో వారాహి యాత్రకు పవన్ సంకల్పించిన సంగతి తెలిసిందే. మొదటి విడత యాత్రలో భాగంగా 34 లోని 10 నియోజకవర్గాలలో యాత్ర కొనసాగిన సంగతి తెలిసిందే. మిగిలిన 24 నియోజకవర్గాలలో ఈ యాత్రను పవన్ పూర్తి చేయబోతున్నారు. ఏలూరు నుంచి మొదలు కానున్న వారాహి రెండో విడత యాత్ర ఎక్కడ ముగుస్తుంది అన్న విషయం తెలియాల్సి ఉంది. రెండో విడత వారాహి యాత్రపై పూర్తిస్థాయి రూట్ మ్యాప్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు జనసేన నేతలు.

ఉభయగోదావరి జిల్లాలోని 34 నియోజకవర్గాలకుగాను 34 జనసేన కైవసం చేసుకోవాలని పవన్ చెబుతున్న సంగతి తెలిసిందే. తొలి విడత వారాహి యాత్ర దిగ్విజయంగా పూర్తయిన నేపథ్యంలో రెండో విడత వారాహి యాత్రను మరింత ఉత్సాహంతో ప్రారంభించేందుకు జనసేన నేతలు, జనసైనికులు సిద్ధమవుతున్నారు. జూన్ 14న అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత వారాహి యాత్ర తొలివిడతను పవన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ దగ్గర నిర్వహించిన బహిరంగ సభ ద్వారా వైసీపీకి పవన్ హెచ్చరికలు జారీ చేశారు. గత ఎన్నికలలో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, ఈసారి కూడా పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని, అందుకే ఉభయ గోదావరి జిల్లాలపై గట్టిగా ఫోకస్ చేశారని తెలుస్తోంది.