దత్తపుత్రుడు.. ప్యాకేజీ స్టార్.. మూణ్నాలుగు పెళ్లిళ్లు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు చేయాల్సి వస్తే.. వైసీపీ వాళ్లు ఎంచుకునే అస్త్రాలు ఇవి. ఆయన నిజానికి చేసుకున్నది మూడు పెళ్ళిళ్ళే అయినా.. జగన్ అండ్ కో మాత్రం ఒకటి యాడ్ చేసి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నట్లుగా విమర్శలు చేస్తుంటారు.
నాలుగు కాదు మూడే అని జనసేన మద్దతుదారులు ఖండిస్తే.. మరి మూడు పెళ్లిళ్లు చేసుకోవడం న్యాయమా అని కౌంటర్ చేయొచ్చన్నది వాళ్ల ఉద్దేశం. నాలుగు నాలుగు అని పదే పదే చెప్పి పవన్ నిజంగానే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్లు జనాలను నమ్మిద్దాం అని కూడా భావిస్తుండొచ్చు.
తాజాగా ఏపీ సీఎం స్కూల్ పిల్లలున్న సభలో పెళ్లిళ్ల గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడి విమర్శలు చేయడం కరెక్టేనా అని కొంచెం కూడా ఆలోచించకుండా పవన్ మీద పాత రికార్డునే అరగదీశారు.
ఐతే పదే పదే పవన్ వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేస్తుంటే జనసైనికులు ఊరుకుంటారా? అందులోనూ వారాహి యాత్ర తాలూకు ఊపులో ఉన్నారు వాళ్లంతా. వాళ్లందరినీ గిచ్చి గిచ్చి తన మీద ఉప్పెనలా పడేలా చేసుకున్నట్లే ఉంది జగన్.
ఎంత సంయమనం పాటిద్దామని చూసినా.. జగన్ రెచ్చగొడుతుండటంతో.. వైఎస్ కుటుంబంలో ఒకటికి మించిన పెళ్లిళ్లు చేసుకున్న వారి జాబితా తీస్తున్నారు జనసైనికులు. జగన్ తాత రాజారెడ్డికి ఇద్దరు భార్యలన్న సంగతి జగద్విదితం. పైగా రెండో భార్య అధికారికం కూడా కాదు. ఆమెకు పుట్టిన తనయుడే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజా రెడ్డి మొదటి భార్య మనవడే అవినాష్ రెడ్డి. ఇక జగన్ సోదరి షర్మిళకు అనిల్ రెండో భర్త అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. మరోవైపు వైఎస్ వివేకాకు కూడా రెండో పెళ్లి జరిగిన సంగతి ఆయన మరణానంతరం బాగానే చర్చనీయాంశమైంది.
మరి కుటుంబంలోనే అంతమంది రెండు పెళ్లిళ్లు చేసుకున్నపుడు.. పవన్ తనతో పొత్తు కుదరని వారికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి.. ఆస్తులు పంచి.. పిల్లల బాధ్యతలు చూస్తూ.. వేరే పెళ్లి చేసుకుంటే జగన్ అండ్ కోకు వచ్చిన నొప్పేంటి అని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమేంటి.. పవన్ ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పకుండా.. తన వ్యక్తిగత విషయాల మీద విమర్శలు చేయడం దిగజారుడుతనం కాదా అని కౌంటర్లు వేస్తున్నారు. జగన్‌కు కౌంటర్ ఇస్తూ జనసైనికులు పెడుతున్న పోస్టులు చూస్తే వైసీపీ వాళ్లకు మంట పుట్టక మానదు.
ప్రత్యేక హోదా ఎందుకు తేలేకపోయారు?
జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
పోలవరం ఎందుకు కట్టలేకపోయారు?
జగన్: పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
రాజధాని మాటేంటి? మన రాజధాని ఏది?
జగన్: నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు..
జనసేన నాయకుల్లో ఒకరైన డాక్టర్ సందీప్ అయితే ఒక టీవీ ఛానెల్ చర్చలో ఇదే టాపిక్ మీద వేసిన ప్రశ్నలకు వైసీపీ వాళ్ల నుంచి సమాధానమే లేదు. ‘‘జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు. మరి ప్రత్యేక హోదా ఏదీ? జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు.. మరి సీపీఎస్ రద్దు చేశాడా? జగన్ ఒక్క పెళ్లే చేసుకున్నాడు.. మరి ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాడా’’.. అంటూ జగన్ ప్రభుత్వ వైఫల్యాలన్నింటికీ పెళ్లి విషయాన్ని ముడిపెట్టి సందీప్ ప్రశ్నిస్తుంటే.. వైసీపీ ప్రతినిధుల ముఖాలు వాడిపోవడం గమనార్హం. ఈ వ్యవహారం చూస్తుంటే జగన్ అనవసరంగా పవన్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించి.. తన వైఫల్యాల మీద పెద్ద చర్చ జరిగేట్లు చేసినట్లు కనిపిస్తోంది.