తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగం చేశారా? కేంద్రం ప్రతిపాదించిన.. విద్యుత్ సంస్కరణలను అమలు చేసేది లేదని ఆయన తెగేసి చెప్పారా? అంటే.. ఔననే అంటున్నారు అధికారులు.. ప్రజా ప్రతినిధులు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే ఇన్సెంటివ్స్‌కు .. సంస్కరణలకు ముడి పెట్టిన విషయం తెలిసిందే. వివిధ రూపాల్లో తెచ్చిన సంస్కరణలు అమలు చేస్తే.. అదనంగా రుణాలు.. నిధులు ఇచ్చి ప్రోత్సహిస్తామని.. గత రెండేళ్లుగా చెబుతున్న విషయం తెలిసిందే.
గతంలో ఒకసారి.. మంత్రి హరీష్ రావు.. ఇదే విషయాన్ని చెప్పారు. రైతులు వాడే విద్యుత్‌కు మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పిందని ఇలా పెడితే 4 వేల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్‌గా ఇస్తామని పేర్కొందని.. కానీ, రైతుల ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని చెప్పారు. అదేసమంయంలో ఏపీ ప్రభుత్వం 4 వేల కోట్లకు కక్కుర్తి పడి అక్కడి రైతుల మెడలకు విద్యుత్ మీటర్ల ఉచ్చు బిగించిందని పెద్ద విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.
ఇప్పుడు మరోసారి.. విద్యుత్ సంస్కరణల అంశం తెరమీదికి వచ్చింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలకు ఓకే చెప్పింది. ఫలితంగా 0.5 శాతం చొప్పున జీఎస్‌డీపీలో కేంద్రం నుంచి ఇన్సెంటివ్‌ను తెచ్చుకోనుంది. కానీ, ఇదే సమయంలో తెలంగాణ దీనిని వదులుకుంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ.. అధికార పార్టీ నాయకులు కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం.. నిధులు కూడా వదులుకున్నారని వివరిస్తున్నారు.
ఏపీలో ఏం జరిగింది?
- రైతులు, బడుగు, బలహీనవర్గాలు, ఆక్వా రైతులు, చిన్నాచితకా పరిశ్రమలకు విద్యుత సంస్కరణలు అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2021-22, 2022-23లో సంస్కరణల అమలు పేరుతో ఏపీలోని వైసీపీ ప్రభుత్వం రూ.9,574 కోట్ల మేరకు అప్పులు తెచ్చుకుంది. తాజాగా మరో రూ.7,000 కోట్ల అప్పు తెచ్చుకునే అవకాశం వైసీపీ సర్కారుకు లభించింది.
- కేంద్రం కొత్తగా మూడు సంస్కరణలు ప్రతిపాదించింది. వాటిని అమలుచేస్తే విద్యుత వినియోగదారులపై మరింత భారం తప్పదు.
- అయినా కూడా సంస్కరణలకు జై కొట్టిన రాష్ట్రాలకు వాటి జీఎస్‌డీపీలో 0.5 శాతం అదనపు అప్పులకు కేంద్రం అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ జీఎస్‌డీపీ రూ.14 లక్షల కోట్లు. ఇందులో 0.5 శాతం అంటే దాదాపు రూ.7,000 కోట్లు. సో.. ఇది ప్రభుత్వం వడ్డీలేని అప్పుగా తెచ్చుకునేందుకు అవకావం ఉంది. దాదాపు ఇంతే మొత్తంలో తెలంగాణకు కూడా వచ్చే అవకాశంఉంది. అయితే.. సంస్కరణలు కాదనడంతో ఈ మొత్తం నిలిచిపోయింది. ఇక, ఈ విషయాన్ని తాజాగా అధికార పార్టీ ప్రచారం చేసుకుంటుండడం గమనార్హం.
మూడు సంస్కరణలు ఇవే..
1) రాష్ట్ర ప్రభుత్వం రైతులు సహా ఎవరికైనా విద్యుత్ ఉచితంగా ఇచ్చినా, సబ్సిడీతో ఇచ్చినా ఆ బిల్లులు వినియోగదారులే ప్రతి నెల చెల్లించాలి. ఏ ఒక్క నెల కట్టకపోయినా కరెంట్ కట్ చేస్తారు.
2) ప్రస్తుతం ఇంటికో కరెంటు మీటర్ ఉంది. అందులో ఎన్ని యూనిట్లు కాలితే అంతకే బిల్లులు చెల్లిస్తున్నాం. కానీ, కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణ ప్రకారం ఇంటికో మీటర్‌తో పాటు కొన్ని ఇళ్ల సమూహాన్ని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆ క్లస్టర్‌కో ప్రత్యేక మీటర్ పెట్టాలి. ఇళ్లలో ఉన్న మీటర్లలో కాలిన యూనిట్లకు, క్లస్టర్ మీటర్‌లో కాలిన యూనిట్లకు మధ్య తేడా ఉంటే ఆ తేడాను కూడా ఆ ఏరియాలో ఉన్న వినియోగదారులపై వేస్తారు.
3) ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ కరెంటు మీటర్లు పెట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. మీటర్‌లో డబ్బులు అయిపోగానే ప్రభుత్వ కార్యాలయాలకు ఆటోమేటిగ్గా కరెంట్ నిలిచిపోతుంది.