ప్రణబ్ దాదా అస్తమయం !

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ లో వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్సకు అవయవాలు స్పందించడం మానేశాయి. దురదృష్టవశాత్తూ ఆయన ఈ లోకాన్ని వదిలివెళ్లిపోయారు. కొద్ది గంటల క్రితమే తన తండ్రి ఆరోగ్యం మరింత క్షీణించడంపై కూతురు షర్మిష్టా ముఖర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతలోనే ఈ ఘోరం జరిగింది.

ప్రణబ్ ముఖర్జీ ఒక మేరు శిఖరం. భారతీయ రాజకీయ నాయకుల్లో ఎన్నదగిన వారిలో ఒకరు. 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా వ్యవహరించారు. రాష్ట్రపతి పదవి స్వీకరించేంత వరకు ఆయన కాంగ్రెస్ పార్టీకి వెన్నదన్నుగా నిలిచారు. పార్టీకి దిక్సూచి అయ్యారు. ఆయన రాష్ట్రపతి కావడం దేశం అదృష్టం, కాంగ్రెస్ దురదృష్టం అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. ఇది రాజకీయాల్లో ఆయన చాణక్యానికి ఒక ప్రశంస. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు సేవలందంచారు.

ప్రణబ్ కుమార్ ముఖర్జీ కేంద్రప్రభుత్వంలో అనేక మంత్రిత్వ పదవులను నిర్వహించాడు. ఆయన కాంగ్రెస్ నాయకుడే అయినా అన్ని పార్టీల నాయకులు ఆయన్ను ప్రత్యేకంగా గౌరవిస్తారు. ఆయన ఒక రాజనీతిజ్జుడు. మేధావిగా, సంక్షోభ పరిష్కర్తగా ఆతనికి ఎవరూ సాటిలేరు.

1969లో జరిగిన కాంగ్రెస్ సభలో అతను బంగ్లా కాంగ్రెస్ తరఫున ప్రతినిధిగా వచ్చిన ప్రణబ్ ప్రసంగం విన్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అతనిని గుర్తించారు. అతని ప్రసంగానికి ముగ్దురాలై అతని గురించి ఆరాతీశారు. ప్రణబ్ ఒక స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడు అని, కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. ఏడాది లోపే అతడిని కాంగ్రెస్ తరఫున రాజ్యసభ సభ్యుడిని చేశారు. తర్వాత ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తులలో ఒకరిగా ఎదిగారు.

1973 లో కేంద్ర ప్రభుత్వంలో స్థానం పొందాడు. తర్వాత అనేకసార్లు మంత్రి అయ్యారు. ప్రణబ్‌ నెహ్రూ కుటుంబంలోని మూడు తరాల నేతలకు సన్నిహితుడుగా మెలిగిన ఏకైక వ్యక్తి. ఇందిరాగాంధీ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రణబ్ ఆమె హఠాన్మరణంతో అనుభవంలేని రాజీవ్‌ గాంధీని ప్రధానిని చేయడాన్ని వ్యతిరేకించి రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్ పేరిట సొంత పార్టీ పెట్టుకున్నారు.

1989లో తిరిగి రాజీవ్‌గాంధీతో రాజీ కుదరడంతో తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 1991లో పి.వి.నరసింహారావు ప్రధాని కావడంతోనే ప్రణబ్‌కు పూర్వ వైభవం వచ్చింది. 1991లో ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌ అయ్యారు. 1995లో విదేశీ వ్యవహారాల శాఖను ఘనంగా నిర్వహించారు.

సోనియా రాజకీయ రంగప్రవేశంలో ఆమెపై విదేశీయత ముద్ర వేయడాన్ని వ్యతిరేకించారు. సోనియాకు అండగా నిలిచాడు. 1998 లో సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలు కావడంలో ప్రధాన పాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో కీలకమైన రక్షణశాఖకు చూశారు. 2009లో ఆయన ప్రధాని అయ్యుంటే కాంగ్రెస్ భవితవ్యం ఇంకో రకంగా ఉండేది. భారత ప్రభుత్వంలోని అన్ని శాఖలపైనా అవగాహన పూర్తిపట్టున్న ఏకైక లెజెండ్ ప్రణబ్.

మన్మోహన్ కంటే కూడా సమర్థుడు అయినా అనేక సమీకరణాలలో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. 2012లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన రాష్ట్రపతి పదవీ కాలం 2017 జూలై 25 న ముగిసింది. అప్పటి నుంచి ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. రెండోసారి పోటీ చేయకపోవడానికి కారణం అదే.
ఇపుడు ఆ మహాశిఖరం కనుమరుగైంది. కానీ ఆయన సేవలు భారతదేశ చరిత్రలో ఎన్నదగినవిగా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది.