వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వైసీపీ సర్కారుపై పంచ్‌లపై పంచ్ లు విసురుతున్నారు. కొబ్బరికి తెల్లదోమ సోకినట్లు.. రాష్ట్రానికి వైసీపీ వైరస్ సోకిందని అన్నారు. వైసీపీ వందమంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకుంటోందని ఆరోపించారు. మనం అనైక్యంగా ఉంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని పేర్కొన్నారు. ఐక్యతతో ఉందాం.. ఏపీని అభివృద్ధి చేసుకుందాం అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
రాజకీయాల్లోకి అలానే వచ్చా
జాతీయ నేతల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ అన్నారు. ఉభయగోదావరి జిల్లాలు.. అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ అని అభివర్ణించిన పవన్.. కోనసీమలో తాగునీటి సమస్యకు తోడు మంచి ఆస్పత్రి ఒక్కటి కూడా లేదని, కోనసీమలో అనేక అభివృద్ధి పనులు ఒక్క బాలయోగి మాత్రమే చేస్తే.. ప్రభుత్వం ఎంత చేయాలి? అని ప్రశ్నించారు. ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా నిలబడే ఉన్నానని చెప్పారు.
కోనసీమలో పెట్రోల్ ఉంది కదా.. అందుకే ఇక్కడి వారిలో ఉద్వేగం ఎక్కువ అని చమత్కరించిన పవన్.. అనైక్యత వల్లే కొంతమంది నేతలు మనల్ని భయపెడుతున్నారని, ఐక్యంగా ఉంటేనే వారేం చేయాలన్నా భయపడతారని తెలిపారు. ప్రజలను కలిపేవాడే నాయకుడు.. విడగొట్టేవాడు కాదు.. అని పరోక్షంగా సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. 80 మంది అనైక్యంగా ఉంటే.. 20 మంది ప్రభుత్వమే వస్తుందని, అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు.
‘ఈ సీఎం.. ఒక ఎంపీని కొట్టించగలరు.. ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని శభాష్ అని అభినందించగలడు’ అని జగన్‌పై పవన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టినప్పుడు గొడవలు జరిగాయని, ఆ సమయంలో సీఎం జోక్యం చేసుకుని.. వ్యతిరేకించిన వర్గాలకు నచ్చజెప్పాలి కదా అని పవన్ పేర్కొన్నారు. కోనసీమ జిల్లాలో రైతులు నీరందక తీవ్రంగా నష్టపోతున్నారని, 3 పంటలు పండేచోట ఒక్క పంటకే పరిమితం అయ్యారని, రైతుల కష్టాలను పోగొట్టే ప్రభుత్వం మనకు కావాలని పవన్ అన్నారు.
‘నేను వస్తున్నానంటే చాలు.. రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయి.. గట్టిగా అడిగేవాడు ఉంటే చాలు.. ఎవరైనా భయపడతారు’ అని పవన్ తెలిపారు. దూరంగా ఉన్న మిల్లులకు రైతులు శ్రమపడి ధాన్యం తీసుకెళ్తున్నారని, తాము వచ్చాక దగ్గరున్న మిల్లులకే ధాన్యం తరలిస్తానని పవన్ తెలిపారు. కొబ్బరికి తెల్లదోమ సోకినట్లు.. ఏపీకి వైఎస్సార్సీపీ వైరస్ సోకిందని జనసేనాని దుయ్యబట్టారు.
‘ఐక్యతతో ఉందాం.. ఏపీని అభివృద్ధి చేసుకుందాం’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. పోలీసులకు ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడి తనకు తెలుసునని, జనసేన అధికారంలోకి వచ్చాక పోలీసులకు సెలవులు, జీతాల ఇబ్బంది లేకుండా చేస్తాం అని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీని అరికడతామని, యువతకు పెట్టుబడి కింద రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
పదవులన్నీ.. రెడ్లకేనా?.. ఇది ఉప్మా ప్రభుత్వం!
కీలకమైన పదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికే ఇస్తారా? అని పవన్ ప్రశ్నించారు. మిగతా కులాల వారిలో ప్రతిభ లేదా.. ఒక్క కులానికే ఉందా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లక్షలమంది శ్రమను దోచుకునే కొంతమందిపై పోరాటం చేస్తానని పునరుద్ఘాటిస్తూ.. వచ్చే ఎన్నికల్లో తనకు అండగా నిలబడాలని పవన్ కల్యాణ్ కోరారు. వైసీపీపీ ప్రభుత్వం.. ఉప్మా ప్రభుత్వం అని పోల్చిన పవన్ కల్యాణ్.. కులం గురించి మాట్లాడితే వైసీపీ నేతలకు ఇబ్బందిగా ఉందని అన్నారు. కులాల గురించి మీరు మాట్లాడవచ్చు కానీ, నేను మాట్లాడకూడదా అని ప్రశ్నించారు. మీరు మాత్రం అమరావతికి కులాలు అంటగట్టవచ్చా అని మండిపడ్డారు. కులం గురించి మాట్లాడేది నేనా.. మీరా..? ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు.