జ‌గ‌న్ వ‌ల్ల 30 కోట్లు న‌ష్ట‌పోయా.. ప‌వ‌న్

ఏపీ సీఎం జగన్‌పై జ‌న‌సేన అధినేత‌ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ‌గ‌న్ కార‌ణంగా తాను ఏకంగా 30 కోట్ల రూపాయ‌లు న‌ష్ట‌పోయిన‌ట్టు ఆయ‌న వెల్ల‌డించారు. ఇది ఎవ‌రిస్తార‌ని.. ఆయ‌న ప్ర‌శ్నించారు. తన సినిమాలు విడుదలైనప్పుడు టికెట్స్ రేట్స్ తగ్గించడం, థియేటర్ల వద్ద ప్రభుత్వ అధికారులతో పహారా చేయించడం వంటి పనులను జగన్ రెడ్డి చేయించినట్లుగా పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఇలాంటి పనుల వల్ల.. తన సినిమాలు హిట్టయినా కూడా.. ఏపీలో నిర్మాతలకి రూ. 30 కోట్లు నష్టం వచ్చిందని.. ఆ నష్టాన్ని తనే భరించానని వెల్లడించారు.

ఈ 30 కోట్ల రూపాయ‌ల న‌ష్టాన్ని జ‌గ‌న్ ఇస్తారా? అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.  ప్రస్తుతం ఆయన ఉభయ గోదావరి జిల్లాలో వారాహి యాత్రను నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ఆయా నియోజక వర్గాలలో ఉన్న అధికార పార్టీ నాయకులపై, వారు చేసిన అవినీతిపై పవన్ కల్యాణ్ ధ్వజమెత్తుతున్నారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. తన సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా.. నిర్మాతలకు భారీగా నష్టం వచ్చిందని తెలియజేశారు.

‘‘నా సినిమాలు ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ విడుదలైనప్పుడు ఏపీలో టికెట్ రేట్లు కావాలనే భారీగా తగ్గించారు. టికెట్ రేట్ కేవలం రూ.10 అంటే.. పెట్టుబడి ఎప్పటికి తిరిగొస్తుంది?. ఆ రెండు సినిమాలూ హిట్ అయ్యాయి.. కానీ ఆంధ్రప్రదేశ్ వరకు నిర్మాతలకు రూ. 30 కోట్ల నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని నేనే భరించాను’’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వ‌చ్చాక ఈ న‌ష్టాన్ని జ‌గ‌న్ నుంచి రాబ‌డ‌తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.