ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఫైరయ్యారు. జగన్ ఓ పులకేశి.. పేదల కష్టాలు.. చూస్తే.. ఆయనకు ఎనలేని ఆనందం అని వ్యాఖ్యానించారు. కరెంట్, గ్యాస్, నిత్యవసరాల ధరలు విపరీతంగా పెంచేశారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదవారిని హింసించి జగన్ ఆనందపడుతాడని మండిపడ్డారు. జిల్లాలోని రాపూరులో యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను కలిసిన స్థానికులు సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రాగానే పన్నుల భారం తగ్గిస్తామన్నారు.
ప్రతి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మహానాడులో చేసిన మినీ మేనిఫెస్టో ప్రకటనను తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రూ.28,147 కోట్ల సబ్ప్లాన్ నిధులు దారిమళ్లించారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్ని పథకాలను కొనసాగిస్తామన్నారు. ఇంతకన్నా మెరుగ్గా పథకాలను అమలు చేసి.. పేదరికాన్ని రూపుమాపుతామని నారా లోకేష్ చెప్పారు. కొందరు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మరాదంటూ.. వైసీపీ నేతలపై నారా లోకేష్ నిప్పులుచెరిగారు.
ఇదేం పాలన సార్: గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు
రాజ్భవన్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను టీడీపీ నేతలు కలిశారు. ఏపీలో శాంతిభద్రతల వైఫల్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళారు. ఏపీలో ఆర్టికల్ 355ను అమలు చేయాలని కోరినట్లు టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. ‘‘శాంతిభద్రతల నియంత్రణకు అధికారిని నియమించాలని కోరాం. ఏపీలో జరుగుతోన్న హత్యాకాండను గవర్నరుకు వివరించాం. జూన్లో 15 రోజుల్లో.. 15 సంఘటనలు జరిగాయి. రోజుకో హత్య, దోపిడీ, మానభంగాలు నిత్యకృత్యమయ్యాయి. రేపల్లెలో పదోతరగతి పిల్లాడిని పథకం ప్రకారం చంపేశారు. రేపల్లెలో పదోతరగతి పిల్లాడు హత్యకు గురైతే సీఎం జగన్ వెళ్లరా?’’ అని అచ్చెన్నాయుడు వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates