జనసేన అధినతే పవన్ కళ్యాణ్‌పై కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నామని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్, వైసీపీ కీలక నాయకుడు వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల పవిత్రతను, బోర్డు పారదర్శకతను దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యానించారని దుయ్యబట్టారు. తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించి పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో చేసిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఒకింత ఘటాగానే స్పందించారు. టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
“కొందరు రాజకీయంగా టీటీడీనీ భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం” అని వైవీ వ్యాఖ్యానించారు. రాజకీయ కారణాలతో టీటీడీపై పలువురు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారంటూ దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని పవన్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆలయ నిర్మాణాలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం శ్రీవాణి ట్రస్ట్‌ను ప్రారంభించామని చెప్పారు.
శ్రీవాణి ట్రస్టు నిధులతో ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో 2445 ఆలయాలని నిర్మాణం చేశామన్నారు. 250 పురాతన ఆలయాలకీ మరమ్మత్తులు చేశామని తెలిపారు. త్వరలోనే శ్రీవాణి ట్రస్టు నిధులపై శ్వేత పత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని అన్నారు. ఈ పథకం కింద దాతలు ఇచ్చిన ప్రతి రూపాయికి రసీదు ఇస్తున్నామని అన్నారు. శ్రీవాణి ట్రస్టుపై అసత్య ఆరోపణలు చేస్తున్న నాయకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని.. కేసులు నమోదు చేసి..కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates