ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్ది దొంగఓట్ల గోల పెరిగిపోవటం సహజమే. ఇదే పద్దతిలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార వైసీపీ దొంగఓట్లను నమోదుచేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే విషయమై ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతు దొంగఓట్లు నమోదుచేయించింది వాస్తవమే అన్నారు. ఓటర్ల నమోదులో తప్పులు జరిగింది వాస్తవమే అని అంగీకరించారు. అలాంటి వాటిని వెరిఫై చేసి తీసేస్తామన్నారు. ఒకే అడ్రస్ తో వందల ఓట్లు నమోదైనట్లు మీనా అంగీకరించారు.
ఎన్నికల కమీషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.90 కోట్ల ఓటర్లున్నట్లు చెప్పారు. 6 అడ్రస్ లో 500 కన్నా ఎక్కువ ఓటర్లు నమోదైనట్లు చెప్పారు. 2100 ఇంటినెంబర్లలో 50 కన్నా ఎక్కువ ఓటర్లున్నట్లు అంగీకరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒకే ఇంటినెంబర్లో 516 ఓట్లున్నట్లు చెప్పారు. 2018 ముందు నుండే ఇలా నమోదైనట్లు చెప్పారు. 2019లో ఇదే ఇంటినెంబర్ పై 670 ఓట్లుంటే ఇపుడు 516 ఓట్లున్నాయని తెలిపారు.
ఒకే వ్యక్తికి రెండుమూడు చోట్ల ఓట్లుండటాన్ని కూడా సాఫ్ట్ వేర్ తో తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 10.20 లక్షల ఓట్లను తొలగించినట్లు మీనా వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో దొంగఓట్ల శాతం కేవలం 0.0037 మాత్రమే అన్నారు. ఓటర్ల నమోదు, ఓటర్ల వెరిఫికేషన్, దొంగఓట్ల తొలగింపు అన్నది నిరంతర ప్రక్రియగా మీనా చెప్పారు. ఓటర్లజాబితాలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించారు.
ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు భారీ సంఖ్యలో దొంగ ఓట్ల నమోదు కాలేదన్నారు. ఓటర్ల జాబితాను ఫైనల్ చేసే ముందు డోర్ టు డోర్ సర్వే చేయటం మామూలే అన్నారు. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలో ఒకే డోర్ నెంబర్ పై ఎక్కువ ఓట్లు నమోదవ్వటం పై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఉద్దేశ్యపూర్వకంగా దొంగఓట్లను నమోదుచేయటంలో సహకరిస్తున్నట్లు తేలితే బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ఓటర్లజాబితాలో సవరణల్లో స్పీడు పెరగాలన్నారు. అక్టోబర్ 17వ తేదీన ముసాయిదా ఓటర్లజాబితాను పబ్లిష్ చేస్తామన్నారు. మొత్తానికి దొంగఓట్లు ఏరేయటం అన్నది పెద్ద తలనొప్పిగా తయారైంది.