‘చిన్న చోరీ’ చేసిన దొంగకు ఉన్న పశ్చాతాపం జగన్ కు లేదా?

తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం.. ఆరోపణలు ప్రత్యారోపణల తర్వాత తొలిసారిగా నిందితుడు బయటకు వచ్చి మాట్లాడారు. ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

అందులో ఆయన ‘పెద్ద తప్పు చేశాను.. తాను చేసిన పెద్ద తప్పునకు భార్య, పిల్లలు బాధనపడి రోజంటూ లేదు..’ అని అన్నారు. తిరుమలలో పరకామణిలో చోరీ కేసు ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగింది. దీనిపై హైకోర్టు జోక్యంతో విచారణ వేగవంతం అయింది. ఆ తర్వాత ఈ చోరీ కేసులో తిరుపతిలో సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన టీటీడీ మాజీ  అసిస్టెంట్‌ విజిలెన్స్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ సతీష్‌కుమార్‌ శవమై తేలడం సంచలనంగా మారింది.

మూడు రోజుల కిందట మాజీ సీఎం వైయస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి పరకామణి చోరీ చాలా చిన్నది.. కేవలం 9 డాలర్లే.. దానికి నిందితుడు ఆస్తి రాసిచ్చి ప్రాయశ్చిత్తం చేసుకున్నారంటూ వెనుకేసుకొచ్చారు. దీనిపై ఏపీ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నిన్న సీఎం చంద్రబాబు సైతం ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది అంటూ జగన్కు కౌంటర్ ఇచ్చారు. చోరీ చేసిన వారిని ఆయన వెనకేసుకు రావడం ఏంటంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

కొద్దిసేపటికే నిందితుడు రవికుమార్ ఒక వీడియోను విడుదల చేశారు. అందులో పలు విషయాలను ఆయన వెల్లడించారు. ‘నా కుటుంబం మొత్తం మేం చేసింది మహాపాపంగా భావిస్తున్నాం.. అందుకు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిని రాసిచ్చానని అన్నారు. జగన్ తన ప్రెస్ మీట్ లో కూడా ప్రాయశ్చిత్వం జరిగిపోయింది కదా.. అని అనడం గమనార్హం. మరోవైపు రవికుమార్ వీడియో విడుదల చేసిన యూ ట్యూబ్ ఛానల్ లో వైసీపీ నాయకులకు చెందిన వీడియోలు ఎక్కువగా ఉండడం గమనార్హం. దీంతో అతని చేత వైసీపీ నాయకులే ఈ వీడియోను విడుదల చేయించారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

కొందరు తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం కూడా గమనించదగిన అంశం. తన ప్రైవేటు భాగాల్లో నగదు దాచినట్లు ప్రచారం జరుగుతోందని.. అది అబద్ధమని, కావాలంటూ శస్త్ర చికిత్స చేయించుకోవచ్చని రవికుమార్ అన్నారు. 2.31 నిమిషాల పాటు ఉన్న వీడియోలో  మాట్లాడుతున్నంతసేపు రవికుమార్ ఏడుస్తూనే ఉన్నారు. ప్రధాన నిందితుడు బయటకు వచ్చి మాట్లాడడంతో.. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి..!