తమ్మినేని తనయుడి పొలిటికల్ పాట్లు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం కాదు. గత ఎన్నికల్లోనూ టీడీపీకి చెందిన అనేక మంది వారసులు విజయం సాధించారు. శ్రీకాళహస్తి, నగరి, మంగళగిరి వంటి నియోజకవర్గాలు దీనికి ఉదాహరణలుగా నిలిచాయి.

ఇక వచ్చే ఎన్నికల్లోనూ వారసుల ప్రభావం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్, నాని ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నారు.

గత ఎన్నికల సమయంలోనే తన కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారని సీతారాం చెప్పారు. కానీ పోటీ తీవ్రంగా ఉండటం, జగన్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోకపోవడంతో తమ్మినేనియే పోటీ చేయాల్సి వచ్చింది. అయితే వచ్చే ఎన్నికలకు ముందుగా మాత్రం మార్పు దిశగా అడుగులు వేయాలని ఈ కుటుంబం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చిరంజీవి నాగ్ రాజకీయ ప్రమోషన్‌ పై దృష్టి పెంచారు. యూట్యూబ్ ఛానళ్లు సహా పలు మీడియా సంస్థలను ఇంటికి పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఆయన వ్యవహరిస్తున్న తీరు వ్యక్తిగత ఇమేజ్‌ కు పెద్దగా ఉపయోగపడడం లేదని రాజకీయ వర్గాల అభిప్రాయం.

యువ నాయకుడిగా ప్రజలను చేరుకోవాల్సిన అవసరం ఉంది. కానీ చిరంజీవి నాగ్ మాత్రం ఆన్‌లైన్ పోస్టులు, మీడియా ఇంటర్వ్యూలకే పరిమితం అవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో తిరుగుతూ సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చాలా తక్కువగా కనిపిస్తోంది.

ఇక తమ్మినేని సీతారాం ఆరోగ్యం బాగోలేకపోవడంతో, ఆముదాలవలస లో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలి అనే విషయంలో వైసీపీ కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు సమాచారం.