సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని అభిమనులే కాదు రెగ్యులర్ మూవీ లవర్స్ ఎన్నిసార్లు చూసినా సరే ఏ మాత్రం విసుగు రాకుండా కట్టిపడేసే ఎంటర్ టైనర్స్. ముఖ్యంగా నరసింహలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలవడం చిన్న విషయం కాదు. ఇప్పుడీ ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఒరిజినల్ తమిళ వెర్షన్ పడయప్ప డిసెంబర్ 12 రజని పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. 1999లో రిలీజైన ఈ ఇండస్ట్రీ హిట్టుకి ఉన్న కల్ట్ ఫాలోయింగ్ మామూలుది కాదు.
ఆ సంవత్సరం ఏప్రిల్ 10 విడుదలైన పడయప్ప 210 ప్రింట్లతో ఆల్ టైం రికార్డు సృష్టించడమే కాక ఏడు లక్షల ఆడియో క్యాసెట్లు మార్కెట్ లో వదలడంలో సంచలనంగా మారింది. ప్రతి చోట వసూళ్ల సునామి చూసి థియేటర్ ఓనర్లకు నోట మాట వచ్చేది కాదు. హౌస్ ఫుల్ బోర్డులు తీయాల్సిన అవసరం లేకుండా కలెక్షన్ల జాతర దెబ్బకు ఆపై రెండు మూడు వారాలు వేరే ఏ కొత్త సినిమా రిలీజ్ చేసేందుకు ఇతర నిర్మాతలకు ధైర్యం చాల్లేదు. రజని స్వాగ్, రమ్యకృష్ణ విలనిజం, ఏఆర్ రెహమాన్ పాటలు, సౌందర్య పాత్ర, కామెడీ ప్లస్ యాక్షన్ ఇలా ఎన్నో అంశాలు ఒకదాన్ని మించి మరొకటి ప్రేక్షకులను ఊపేశాయి.
తమిళనాడులో 86 థియేటర్లలో వంద రోజులు ఆడింది పడయప్ప. తెలుగులో కూడా ఘనవిజయం అందుకుంది. 49 సెంటర్లలో యాభై రోజులు ఆడటం డబ్బింగ్ సినిమాల పరంగా ఒక రికార్డే. ఇదంతా బాగానే ఉంది కానీ నరసింహను తెలుగులో కూడా రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఎందుకంటే దీంట్లో ఎంజాయ్ చేసినంత వింటేజ్ రజనీని మళ్ళీ మరోదాంట్లో చూడలేం. కాకపోతే తెలుగు హక్కుల స్వంతదారు నిర్మాత ఏఎం రత్నం ప్రస్తుతం అందుబాటులో లేరు. సో ఇప్పటికిప్పుడు వచ్చే ఛాన్స్ లేనట్టే. దీని స్థానంలో శివాజీ ది బాస్ రీ రిలీజ్ అవుతోంది. పడయప్ప విషయంలో రజని ఫ్యాన్స్ లక్కీనే.
Gulte Telugu Telugu Political and Movie News Updates