దురంధర్ మీద రాళ్ళూ పూలూ విసురుతున్నారు

మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా అనిపించకపోవడం, మూడున్నర గంటల నిడివి అనే ప్రచారాన్ని నెగటివ్ గా తీసుకెళ్లడం లాంటి కారణాలు అడ్వాన్స్ బుకింగ్స్ మీద ప్రభావం చూపించాయి. గోవా ఈవెంట్ లో రణ్వీర్ సింగ్ కాంతారని ఇమిటేట్ చేయబోయి క్షమాపణ దాకా తెచ్చుకోవడం కొన్ని వర్గాల ఆగ్రహానికి కారణమయ్యింది. దెబ్బకు సారీ చెప్పాడు. సరే ఇదంతా ఎలా ఉన్నా కంటెంట్ బాగుంటే జనాలు చూస్తారు కాబట్టి దురంధర్ విషయంలో అదే జరిగింది. ఫస్ట్ డే కంటే శని ఆదివారాల కలెక్షన్లు బాగున్నాయి.

రేంజ్ ఏంటనేది ఇప్పుడే చెప్పలేం కానీ దురంధర్ మీద సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. ఒక వర్గం సపోర్ట్ చేస్తూ ప్రశంసల ట్వీట్లు పెడుతుండగా, మరో వర్గం ఈ మూవీ నిర్మాణ భాగస్వామి జియో స్టూడియోస్ కావాలని కార్పొరేట్ బుకింగ్స్ చేయడంతో పాటు కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తోందని దెప్పి పొడుస్తోంది. వీటిలో నిజమెంతనేది పక్కన పెడితే నిజంగానే దురంధర్ పికప్ అయిన మాట వాస్తవం. పాజిటివ్ టాక్ వేగంగానే వెళ్తోంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రధాన మల్టీప్లెక్సుల షోలన్నీ అడ్వాన్స్ లోనే ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా సాయంత్రం పూట ప్రీమియం స్క్రీన్లు టికెట్ దొరకడం కష్టంగా ఉంది.

అలాంటప్పుడు ఫేక్ వసూళ్లను ఎందుకు చూపిస్తారనేది ఒక వాదన. సోమవారం మొదలయ్యేలోగా వంద కోట్ల మార్కును దాటేస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. వచ్చిన టాక్ ప్రకారం చూసుకుంటే ఈపాటికి లాంఛనం జరిగిపోవాలి. కానీ రణ్వీర్ సింగ్ ఇమేజ్ అంత స్థాయిలో లేకపోవడంతో నెంబర్ల మీద ప్రభావం పడింది. నిడివి విషయంలో వస్తున్న కంప్లయింట్స్ దృష్టిలో ఉంచుకుని కొంచెం ట్రిమ్ చేస్తే బాగుంటుందని మూవ్ లవర్స్ కోరుతున్నా దర్శకుడు ఆదిత్య ధార్ ఆ ఉద్దేశంలో లేరు. ప్రీ రిలీజ్ ముందున్న నెగిటివిటిని తట్టుకుని ఇంత మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం పట్ల అతనైతే హ్యాపీగా ఉన్నాడు. రణ్వీర్ సంగతి సరేసరి.