పవర్ స్టార్… ఇప్పుడు అభినవ శ్రీకృష్ణదేవరాయ!

ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవద్గీత ఒకసారి చదివి, ఎర్ర వస్త్రంతో కప్పి పూజా గదిలో దాచే గ్రంథం కాదన్నారు. మన జీవితంలో ప్రతి నిర్ణయం, ప్రతి గందరగోళం, ప్రతి మానసిక సమస్యకు పరిష్కారంగా మనల్ని నడిపించే ఙ్ఞానం భగవద్గీత అని పేర్కొన్నారు. భగవద్గీతలోని అంశాలను ప్రత్యేకంగా స్మరించుకునేందుకు, నేటి తరానికి భగవద్గీత గొప్పతనాన్ని వివరించేందుకు ఉడుపిలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు..

అనంతరం పవన్ కళ్యాణ్ కు”అభినవ కృష్ణ దేవరాయ” అనే బిరుదును పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ ప్రధానం చేశారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ఆశయాలకు అనుగుణంగా భారతీయ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్‌ చేస్తున్న కృషిని, ప్రయత్నాలను గుర్తించి ఉడిపి శ్రీ కృష్ణ మఠానికి చెందిన పీఠాధిపతి ఆయనను “అభినవ శ్రీ కృష్ణ దేవరాయ” అనే బిరుదుతో గౌరవించారు. విశేషం ఏమిటంటే ఉడిపి శ్రీ కృష్ణ మఠం అభినవ శ్రీ కృష్ణ దేవరాయ బిరుదు ప్రదానం చేస్తూ ఒకర్ని సత్కరించటం ఇదే తొలిసారి. 

పవన్ కళ్యాణ్ ఇంకా ఏమన్నారంటే.. సినిమాలు, వినోదానికి ప్రజలు భారీగా ఖర్చు చేస్తున్నాం. మన సంస్కృతికి ప్రతీక అయిన గోమాతను కాపాడడం కూడా అందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. “వ్యక్తిగతంగా నేను 60 ఆవులను సంరక్షిస్తూ గోశాల న‌డుపుతున్నాను. మనం పూజించే పవిత్ర గోమాతను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అక్రమ వధపై కఠిన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఆవులను సంరక్షించడం కూడా ఎంతో అవసరం,” అని అన్నారు.