తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. అన్నతో పోలిస్తే కార్తి కొంచెం నయమే కానీ.. అతడికీ పెద్ద మాస్ హిట్ పడి చాలా కాలమే అయింది. గత ఏడాది మెయ్యళగన్‌తో ఆకట్టుకున్నప్పటికీ అది కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించలేదు. ఇప్పుడు కార్తి వా వాత్తియార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సూదు కవ్వుం లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయిన నలన్ కుమారస్వామి ఈ చిత్రానికి దర్శకుడు.
కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైంది. అన్ని ఇబ్బందులనూ అధిగమించి ఈ నెల 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు అన్నగారు వస్తారు అనే అచ్చ తెలుగు టైటిల్ పెట్టారు. కార్తి ముందు నుంచి తన చిత్రాల తెలుగు డబ్బింగ్, టైటిళ్ల విషయంలో శ్రద్ధ వహిస్తూనే ఉన్నాడు. తన సినిమాల్లో తమిళ పేర్లతో ఉండే బోర్డులను కూడా తెలుగులోకి మార్పిస్తూ ఉంటాడు కార్తి.
అన్నగారు వస్తారు సినిమా విషయంలో తన తెలుగు ప్రేమ ఇంకో స్థాయికి చేరినట్లే కనిపిస్తోంది.
తమిళంలో ఈ కథకు లెజెండరీ నటుడు ఎంజీఆర్‌కు కనెక్షన్ ఉంది. వాత్తియార్ అన్నది ఎంజీఆర్‌కు అభిమానులు పెట్టుకున్న పేరు. అంటే ఉపాధ్యాయుడు అని అర్థం. తన సినిమాలతో ఎన్నో మంచి సందేశాలు ఇచ్చిన ఆయనకు ఆ పేరు ఇచ్చారు అభిమానులు. ఆ టైటిల్ పెట్టడానికి, కథకు కూడా ఎంజీఆర్‌కు పెద్ద కనెక్షనే ఉందని తమిళ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. విశేషం ఏంటంటే.. తమిళంలో ఉన్న ఎంజీఆర్ పోర్షన్స్ అన్నీ తెలుగులోకి వచ్చేసరికి ఎన్టీఆర్ మీదికి మార్చేశారు. ఇక్కడ హీరో మీద ఎన్టీఆర్ ప్రభావం ఉన్నట్లు చూపించారు.
కార్తి ఒరిజినల్లో ఎంజీఆర్‌ను పోలిన వింటేజ్ గెటప్ వేశాడు. తెలుగులో దాన్నేమీ మార్చకపోయినా.. ఎన్టీఆర్ సైతం అలాంటి గెటప్‌లతో సినిమాలు చేయడంతో ఇబ్బంది లేకపోయింది. బ్యాగ్రౌండ్లో ఎంజీఆర్ పాపులర్ సినిమా యంగ వీట్టు పిల్లై టైటిల్ ట్రాక్ తీసేసి..తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అనే ఎన్టీఆర్ పాటను ప్లే చేశారు బ్యాగ్రౌండ్లో. ఇంకో తమిళ హీరో అయితే.. తెలుగు వెర్షన్ కోసం ఇలా మార్చేవాడా అన్నది సందేహమే. ఎంజీఆర్ పాత్రనే పెట్టి లాగించేసేవాడేమో. ఎన్టీఆర్‌తో కనెక్షన్ పెట్టడం వల్ల ఈ సినిమాకు మన వాళ్లు బాగా కనెక్ట్ అయ్యే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates