కేసీఆర్ కోసం.. జ‌గ‌న్ త్యాగం చేస్తున్నారా…!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ల‌కు మ‌ధ్య స్నేహం ఉన్న విష‌యం తెలిసిందే. ఒక్క నీటి విష‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య కొంత మేర‌కు విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ.. మిగిలిన విష‌యాల్లో ఇద్ద‌రూ స‌ర్దుకు పోతున్నారు. పైకి గంభీరంగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం ఇద్ద‌రూ స్నేహం కొన‌సాగిస్తున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు రావాల‌ని కోరుకున్న కేసీఆర్.. దానికి అనుగుణంగానే 2019లో చ‌క్రం తిప్పార‌నేది కూడా తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ అవ‌స‌రం.. కేసీఆర్‌కు వ‌చ్చింది. అదేవిధంగా ఇప్ప‌టికీ.. కేసీఆర్ అవ‌స‌రం జ‌గ‌న్‌కు ఉంది. ఈ రెండు విష‌యాల్లోనూ ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకునేందుకు మ‌రోసారి.. రెడీ అయ్యార‌నేది తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ‌లో రాజ‌కీయాలు మారుతున్నాయి. జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల త‌న పార్టీ వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు.. తాను డిప్యూటీ సీఎం పోస్టును తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నార‌నేది ప్ర‌స్తుత ప‌రిణామం.

ఇదే జ‌రిగితే.. కేసీఆర్ మూడో సారి అధికారంలోకిరావాల‌నే క‌ల కొంత ఇబ్బందుల్లో ప‌డుతుంది. ఈ ప‌రిణామం.. కేసీఆర్‌కు కంటి పై కునుకులేకుండా చేస్తోంది. ఇక‌, తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం పోయి.. కాంగ్రెస్ వ‌స్తే.. అది ప్ర‌త్య‌క్షంగాను, ప‌రోక్షంగాను కూడా జ‌గ‌న్‌కు ఇబ్బందే అవుతుంది. ఏపీలో కాంగ్రెస్ పుంజుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. దీంతో వైసీపీ ఓటు బ్యాంకు చెల్లాచెదుర‌య్యే ప‌రిస్థితి ఉంటుంది.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జ‌గ‌న్ త్యాగాల‌కు రెడీగా ఉన్నార‌నేది తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల టాక్‌. తెలంగాణ‌లోని రెడ్డి సామాజిక వ‌ర్గంతోపాటు పారిశ్రామిక వ‌ర్గాల‌కు కూడా.. జ‌గ‌న్ న‌చ్చ‌జెప్పి.. మ‌రోసారి కేసీఆర్ స‌ర్కారును అధికారంలోకి తీసుకురావ‌డంపై ఆయ‌న దృష్టి పెట్టార‌ని.. ఈవిష‌యాన్ని కేసీఆర్ కూడా.. జ‌గ‌న్‌తో చ‌ర్చించి అంగీక‌రించేలా చేశార‌ని టాక్‌. అదేస‌మ‌యంలో ఏపీలో జ‌గ‌న్ మ‌రోసారి అదికారంలోకి వ‌చ్చేలాతాను స‌హ‌క‌రిస్తాన‌ని కూడా కేసీఆర్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి, జ‌గ‌న్‌, కేసీఆర్‌ల మ‌ధ్య రాజ‌కీయం మ‌రింత చేరువ అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌నిఅంటున్నారు ప‌రిశీల‌కులు.