జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ తమకు ఒక చెప్పు చూపించాడని, మక్కెలిరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడని, అయితే, తమకు రెండు చెప్పులున్నాయని పవన్ ను ఉద్దేశించి ప్రెస్ మీట్ లో పేర్ని నాని రెండు చెప్పులు చూపించడం సంచలనం రేపింది. దీంతో, పేర్ని నాని రెండు చెప్పులు చూపించడం పై పవన్ కళ్యాణ్ కూడా ఘాటుగా సమాధానం ఇచ్చారు.
అన్నవరం గుడి బయట తన చెప్పులు పోయానని, వాటిని ఎవరో కొట్టేశారని పేర్ని నానికి సెటైరికల్ గా పవన్ పిఠాపురంలో కౌంటర్ ఇచ్చారు. నాని పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే పేర్ని నాని వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న రీతిలో ఈ చెప్పులపై మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. తన చెప్పులు పోయాయని పవన్ కళ్యాణ్ ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోందని, అయినా చెప్పులు పోయిన మూడు రోజుల తర్వాత ఆ సంగతి గుర్తొచ్చిందా అంటూ పేర్ని నాని తనదైన చమత్కార ధోరణిలో పవన్ కు చురకలంటించారు.
చెప్పులు పోతే ఎవరో ఒక నిర్మాత కొనిస్తారని, కానీ ఆయన పార్టీకి ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు కూడా పోయిందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ముందు ఆ గాజు గ్లాసు గుర్తు ఎక్కడుందో వెతుక్కోవాలంటూ వెటకారంగా మాట్లాడారు. పార్టీ సింబల్ పోయి చాలా రోజులైంది పవన్… చెప్పులు పోతే కంగారేముంది అంటూ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి, పేర్ని నాని వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ కౌంటర్ ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు అనూహ్యమైన స్పందన వస్తుండడంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని జనసేన నేతలు అంటున్నారు. అందుకే, పవన్ ను ఏదో ఒక రకంగా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates