అన్నవరం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కత్తిపూడిలో నిర్వహించిన బహిరంగ సభలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు చేశారు. రాబోయే ఎన్నికలలో గెలిచి తప్పకుండా అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ కు పవన్ సవాల్ విసిరారు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. పవన్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు ఒక చెప్పు చూపించిన పవన్ కు మీడియా సమావేశంలో పేర్ని నాని రెండు చెప్పులు చూపించారు. ఈ నేపథ్యంలోనే పేర్ని నాని వ్యాఖ్యలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.
పేర్ని నాని వ్యాఖ్యలు బాధ కలిగించాయని, పవన్ పై వైసీపీ నేతలు దుర్భాషలాడడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు ఎక్కువ అవకాశాలున్నాయని, టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసేందుకు ఛాన్స్ ఉందని రఘురామ జోస్యం చెప్పారు. ఈ మూడు పార్టీల కలయిక వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని రఘురామ అన్నారు.
మరోవైపు, కుప్పంలో సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అధికారులు అనుమతినివ్వడంలేదని రఘురామ ఆరోపించారు. అయితే, ఈ విషయం జగన్ కు తెలిసి జరుగుతుందా లేదా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. జగనన్నకు చెబుదాం పథకం విఫలమైందని, అందుకే జగనన్న సురక్ష అనే కొత్త టైటిల్ విడుదల చేశారని రఘురామ సెటైర్లు వేశారు. అసలు ఈ పథకం ఉద్దేశం ఏమిటో ఎందుకు పెట్టారో ఎవరికైనా తెలుసా అని వైసీపీ నేతలకు చురకలంటించారు. మరి, రఘురామ వ్యాఖ్యలపై వైసీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates