ఏపీలో బీజేపీ టార్గెట్ ఆ 5 లోక్‌స‌భ సీట్లేనా…!

తాజాగా విశాఖ‌లో ప‌ర్య‌టించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా.. రాష్ట్రంలోని పార్ల‌మెంటు స్థానాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారా? ఇక్క‌డి పార్ల‌మెంటు స్థానాల నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటీ చేయాల‌నే అంశంపై ఆయ‌న చ‌ర్చించారా? ఈ క్ర‌మంలో కొంద‌రి ప్రొఫైళ్ల‌ను కూడా ఆయ‌న సేక‌రించారా? అంటే.. ఔన‌నే అంటున్నారు అత్యంత విశ్వ‌స‌నీయ బీజేపీ రాష్ట్ర నేత‌ల్లో ఒక‌రిద్ద‌రు.

రాష్ట్రంలో మొత్తం 25 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో వ‌చ్చే ఎన్నికల్లో ఐదు స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకునేందుకు బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. “ఎన్నాళ్లు ఇత‌ర పార్టీల‌ పై ఆధార‌ప‌డ‌తాం. మ‌నం ఎద‌గాలి. క‌నీసం ఐదు స్థానాల్లో అయినా.. విజ‌యం ద‌క్కించుకోవాలి” అని గ‌ట్టిగానే అమిత్ షా టార్గెట్ పెట్టార‌ని… తెలిసింది. మొత్తం 5 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఆయ‌న నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

వీటిలో విశాఖ‌, రాజంపేట‌, అన‌కాప‌ల్లి, విజ‌య‌న‌గ‌రం, గుంటూరు స్థానాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ సంద‌ర్భంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వ్య‌వ‌హారం కూడా. చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న పార్టీలో ఉంటే.. గుంటూరు ఎంపీ స్థానం ఇవ్వాల‌ని పార్టీ నిర్ణ‌యించుకుంద‌ని… అయితే, అనూహ్యంగా ఆయ‌న పార్టీ మారార‌ని అయినా. గ‌ట్టిగా పోరాటం చేసి గుంటూరులో విజ‌యం ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని షా సూచించిన‌ట్టు తెలిసింది.

అదే స‌మ‌యంలో విజ‌య‌న‌గ‌రంలో ఈ సారి బీజేపీ జెండా ఎగ‌రాల‌ని కూడా షా నిర్దేశించిన‌ట్టు స‌మాచారం. ఇదిలావుంటే.. త‌న‌కు విశాఖ‌తో ఎంతో అనుబంధం ఉంద‌ని.. త‌న కుటుంబంలోని వారు ఇక్క‌డ ఆంధ్ర విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుకున్నార‌ని.. 2014లో ఇక్క‌డ కంభంపాటి విజ‌యంద‌క్కించుకున్నార‌ని… మ‌రి ఇప్పుడు ఇక్క‌డ ఎందుకు పార్టీ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌లేక పోతోంద‌ని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించార‌ట‌.