మూడు రాజధానులపై జగన్ స్పీడ్.. సుప్రీంకు లేఖ

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఇకపై ఏమాత్రం ఆలస్యం వద్దన్న రీతిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు కదులుతోంది. ఇప్పటికే అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లు రద్దుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే.. వాటిపై రాజపత్రాలను జారీ చేసిన జగన్ సర్కారు… కోర్టుల్లో పిటిషన్ల వల్ల కొనసాగుతున్న జాప్యానికి చెక్ పెట్టేలా చర్యలు షురూ చేసింది. ఇందులో భాగంగా వికేంద్రీకరణపై హైకోర్టు విధించిన స్టేటస్ కోపై స్టే విధించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేసిన జగన్ సర్కారు.. తాజాగా సోమవారం లేఖ కూడా రాసింది. మూడు రాజధానుల విషయంలో ఇకపై ఎంతమాత్రం జాప్యం చేయొద్దని సదరు లేఖలో సుప్రీంను జగన్ సర్కారు కోరింది.

సుప్రీం కోర్టులో తాను దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని జగన్ సర్కారు విజ్ఞప్తి చేసింది. మూడు రాజధానుల బిల్లులకు ఏపీ హైకోర్టు ఈ నెల 14 వరకు స్టేటస్‌ కో విధించిన విషయం తెలిసిందే. దీనిపై స్టే విధించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం ఇదివరకే సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే దానిపై సోమవారం విచారణకు వస్తుందని అంతా భావించారు. కానీ, ఆ పిటిషన్ విచారణకు రాకపోవడంతో సోమవారమే అత్యవసర విచారణ చేపట్టాలంటూ సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు జగన్ సర్కారు లేఖ రాసింది.

ఆంధ్రప్రదేశ్‌ పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన ‘స్టేటస్‌ కో’ని ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ కాపీని కెవియట్‌ వేసిన వారికి తామే పంపినట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. ప్రతివాదులకు పిటిషన్‌ కాపీ పంపినందున వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం లేఖలో కోరింది. మరి సుప్రీంకోర్టు ఈ లేఖపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తుంటే.. మూడు రాజధానులపై ఇక ఎంతమాత్రం జాప్యం జరగకూడదన్న స్పీడుతోనే జగన్ సర్కారు కదులుతోందన్న భావన వ్యక్తమవుతోంది.