రాజకీయాల్లో బలమైన నేతల హవానే వేరు ఉంటుంది. కాలక్రమంలో కొన్ని రాజకీయ కుటుంబాల ఫేమ్ తగ్గొచ్చు. కానీ.. వారి గతాన్ని చూస్తే.. ఇన్ని జరిగాయా? అన్న విస్మయం కలుగక మానదు. వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలగటమే కాదు.. ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నంతనే రెబల్ రాజకీయ కుటుంబంగా కొండా ఫ్యామిలీకున్న పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇన్ని కావు. వైఎస్ మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించే కొండా దంపతులు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాల్ని వెల్లడించారు.
వైఎస్ ఉన్నప్పుడు తమ హవా నడిచిందన్న మాటను ఒప్పుకున్న కొండా దంపతులు.. ఆయన బతికి ఉంటే తమ హవా మరింత కాలం నడిచేదన్నారు. ‘రేపటి నుంచి కొండా మురళిదే వరంగల్. ఇన్ని రోజులు పొన్నాల లక్ష్మయ్య.. రెడ్యా నాయక్ ఏదో చేస్తారనుకుున్నా. కానీ నీకు మంత్రి పదవి ఇవ్వక తప్పు చేశా. రేపటి నుంచి మురళి నువ్వు ఏది చెబితే అదే అని చెప్పారు. మా దురదృష్టం కొద్దీ ఆ తర్వాత రోజే వైఎస్ చనిపోయారు. వైఎస్సార్ కోసం రాజీనామా చేసినందుకు మేం ఫీల్ కాలేదు. కానీ.. జగన్ వెంట ఎందుకు నడిచామనే ఫీలింగ్ ఒక్కటే ఉంది. ఆయన కోసం మేం తెలంగాణ ద్రోహులమని ముద్ర వేయించుకున్నాం’ అని సురేఖ వ్యాఖ్యానించారు.
జగన్ వెంట ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తనను పిలిపించుకొని మాట్లాడిన విషయాల్ని కొండా మురళి వెల్లడించారు. ‘తిరుపతిలో రూ.5వేల కోట్ల కాంట్రాక్టు ఇస్తా. రేఖమ్మను కాంగ్రెస్ లోకి తీసుకురా. ఆమెకు మంత్రి పదవి ఇస్తా. నీ ఎమ్మెల్సీ కొనసాగిస్తానని చెబితే సారీ చెప్పా. తర్వాత జగన్ దగ్గరకు వెళ్లి.. అన్నా నాకు సెక్యూరిటీ చాలా ముఖ్యం. ఎమ్మెల్సీ కావాలని అడిగా. అరె అన్నా.. నువ్వు ఎమ్మెల్సీ అని నేననుకోలేదు. మరిచిపోయానని చెప్పారు’ అని మురళీ చెప్పారు.
తర్వాత జగన్ ఒక లేఖ రాసి పంపారని.. ఏ కుటుంబంలో అయినా మూడు పదవులు ఉంటాయా? అడగటంలో హద్దులు ఉండాలన్నారని సురేఖ చెబితే.. ఆ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. “జగన్ ది వక్రబుద్ధి. ఆయన మీటింగ్ ల కోసం చాలా ఖర్చుచేశా. ధర్నా చౌక్ దగ్గర ఆయన ధర్నా చేస్తే.. జనం రావట్లేదన్నా.. అని నా ముందు కన్నీరు పెట్టుకున్నారు. తెల్లారేసరికి 25 వేల మందిని తీసుకెళ్లా” అని గతాన్ని గుర్తు చేసుకున్నారు కొండా మురళి.
తమను షర్మిల పార్టీ పెట్టే టైంలో ఫోన్ చేశారన్న కొండా సురేఖ.. ‘షర్మిల ఇక్కడ పార్టీ పెట్టటమే తప్పు. అన్న మీద కోపం ఉంటే ఆంధ్రాలో పార్టీ పెట్టాలి. ఏపీలో కాంగ్రెస్ లో చేరి కొట్లాడాలి. క్రిస్టియన్ ఓట్లు.. రాజశేఖర్ రెడ్డి అభిమానుల ఓట్లను చీల్చేందుకు కేసీఆర్ వేసిన ప్లాన్ ఇది. దీని వల్ల కాంగ్రెస్ కు దెబ్బ. బీజేపీ.. బీఆర్ఎస్.. షర్మిల.. అంతా ఒక్కటే. రేపో మాపో కవిత అరెస్టు అన్నారు. ఆ తర్వాత ఏమైంది? ఇలా అయితే.. కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు ఎందుకు నమ్ముతారు? అని కొండా సరేఖ పేర్కొన్నారు. వరంగల్ లో నక్సలైట్లు యాక్టివ్ గా ఉన్నారా? అంటే ఉన్నారన్న మురళి.. అందుకే భయంగానే గన్ మెన్లను వేసుకొని తిరుగుతానని.. కోర్టు అనుమతితో ముగ్గురు గన్ మెన్లను పెట్టుకున్నట్లు చెప్పారు. సురేఖకు ఇద్దరు గన్ మెన్లు ఉన్నారని.. కానీ తామిద్దరం ఒకే కారులో ఎప్పుడూ వెళ్లమని చెప్పారు.